పార్వతీపురం: వినియోగదారులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తినప్పుడే ఆశించిన న్యాయం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ప్రభుత్వం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై నిర్దేశించిన బరువు, కాల పరిమితి, ఎం.ఆర్.పి విలువలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. వస్తువు ధరలో అన్ని రకాల పన్నులు కలిపే ఎం.ఆర్.పిని నిర్ణయిస్తారని, అంతకంటే ఎక్కువ వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవడం వినియోగదారుడి ప్రాథమిక బాధ్యత అని, అది భవిష్యత్తులో ఏదైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రధాన ఆయుధంగా పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, వినియోగదారులు తమ సమస్యలను ఆన్‌లైన్ ద్వారా లేదా ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బి.అశోక్, డాక్టర్ జగన్మోహన్‌రావు, లీగల్ అడ్వైజర్ టి.జోగారావు వివిధ పాఠశాలల విద్యార్థులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.


