విజయనగరం: న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియం వేదికగా మార్చి 8 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో మన్యం జిల్లాకు చెందిన పారా క్రీడాకారిణి కిల్లక లలిత సత్తా చాటింది. టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగులో అద్భుతమైన ప్రతిభ కనబరచి రజిత పతకం సాధించింది. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ పేర్కొన్నారు. గత పదేళ్లుగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ప్రోత్సాహంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూరులో కోచ్‌లు రాహులు, బాలకృష్ణన్‌ల శిక్షణలో, గైడ్ రన్నర్ తబరీష్‌ల సహకారంతో వరుసగా విజయాలు సాధిస్తున్న లలిత గ్రాండ్ ప్రిక్స్ పోటీలలోనూ తానేంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఇండియా తరఫున ఎంపికై న ఆరుగురు క్రీడాకారుల జట్టులో స్థానం సంపాదించిన లలిత అసాధారణ ప్రతిభతో మరో విజయాన్ని దేశానికి అందించిందని పేర్కొన్నారు.


