ట్రాక్టర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా

Mar 14 2026 8:37 AM | Updated on Mar 14 2026 8:37 AM

బొండపల్లి: మండల కేంద్రానికి సమీపంలో చలి చెరువు వద్ద జాతీయ రహదారిపై బొండపల్లి నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి శుక్రవారం బోల్తా పడింది. వివరాలు.. బొండపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి, బంగారయ్య, చంద్రరావు ట్రాక్టర్‌ ట్రక్కులో వస్తుండగా చలి చెరువు అదుపు తప్పి బోల్తా పడి ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది.

ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం

పూసపాటిరేగ : భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఆగి వున్న లారీని ఆటో వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లే.. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆటో పోలిపల్లి సమీపంలో ఆగి వున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శీల రాంబాబు మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం దుకాణంలో చోరీ

బొండపల్లి: మండల కేంద్రంలోని నవీన్‌ వైన్స్‌ దుకాణంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి మద్యం దుకాణం మూసేసిన తరువాత సిబ్బంది ఇంటికి వెళ్లిపోగా శుక్రవారం తెల్లవారుజామున దొంగలు తాళాలను విరగ్గొట్టినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు, షాపు నిర్వాహకులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్‌ఐ యు.మహేష్‌తో పాటు సిబ్బంది వెళ్లి పరిశీలించగా షాపులో ఉంచిన రూ.12వేల నగదు అపహరించుకుపోయినట్టు గుర్తించారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీం వచ్చి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అభ్యంతరాలకు ఆహ్వానం

విజయనగరం అర్బన్‌: జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నట్టు విద్యాశాఖ జిల్లా అధికారి యు.మాణిక్యం నాయుడు తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌లు, సమాన సిబ్బంది వర్గాలు, ఎస్‌జీటీలు, సమాన సిబ్బంది వర్గాలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ఈ నెల 1 నాటికి రూపొందించి ప్రచురించినట్టు పేర్కొన్నారు. దీనికి సవరించిన ప్రోవిజినల్‌ సీనియారిటీ జాబితాను ఈ నెల 15న విడుదల చేయనున్నట్టు తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ కార్యాలయ వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని సూచించారు. జాబితాలో ఎలాంటి అభ్యంతరాలున్నా.. తగిన ఆధారాలతో ఈ నెల 21న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య జిల్లా కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయ పనిదినాల్లో సమర్పించాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది సీనియారిటీ జాబితా ప్రకటించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement