పెరుగుతున్న కేసులు..
● జనాన్ని భయపెడుతున్న శునకాలు
● ఏడాదిలో 26,368 మందికి కుక్కకాట్లు
● ఓ బాలుడి మృతి
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నమోదైన కేసులు
4,470
సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో
నమోదైన కేసుల సంఖ్య
8,508
పీహెచ్‌సీల పరిధిలో నమోదైన కేసులు
13,390
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు అరసవిల్లి. ఇతనిది బొండపల్లి మండలం. ఇంటి నుంచి పొలానికి వెళ్తుండగా కుక్క వెంటబడి విచక్షణ రహితంగా కరిచేసింది. రెండు కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. ఆయన విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందారు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో అనునిత్యం కుక్కలు స్థైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కుక్కలు కరవడంతో వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా శునకాలు దాడిచేస్తుండంతో జనం హడలిపోతున్నారు. ఒంటిరిగా కనిపిస్తే చాలు.. గుంపుగా వచ్చి దాడిచేస్తుండడంతో పాఠశాలకు, పొలానికి, మార్కె ట్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలు సంచరించకుండా, కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కొన్నిచోట్ల అధికారులు మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు జిల్లాలో 26,368 మందిని కుక్కలు కరిచాయి. వీరంతా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు పొందారు. పీహెచ్‌సీల పరిధిలో 13,390 కేసులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 4,470 కేసులు, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల పరిధిలో 8,508 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు 70 నుంచి 75 మంది కుక్కకాటుబారిన పడుతున్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి.
వ్యాక్సిన్ వేయించాలి
కుక్కలు కరిస్తే వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) వేయించాలి. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏఆర్‌వీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. నిర్లక్ష్యం చేస్తే రేబిస్ వ్యాధిబారిన పడే అవకాశం ఉంది.
– డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్‌ఓ
బొబ్బిలి మండలం దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన రామవరపు రమణ అనే 9 ఏళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడిచేసి మొఖంపై కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) వేయించారు. ఈ నెల 3వ తేదీన బాలుడిలో రేబిస్ లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ఈ నెల 4వ తేదీన మరణించాడు.
పెరుగుతున్న కేసులు..
పెరుగుతున్న కేసులు..
పెరుగుతున్న కేసులు..


