ఆరు అడుగుల స్థలం కోసం ఆందోళన
వేపాడ: చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలం లేదు.. ఎక్కడ ఖననం చేయాలో తెలియడం లేదు.. తక్షణమే శ్మశానవాటిక (ఖబర్‌స్థాన్) కోసం స్థలం కేటాయించాలంటూ వేపాడ మండలం జాకేరు గ్రామానికి చెందిన ముస్లింలు ఆందోళన చేశారు. చిన్నారి మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేయాలో చెప్పాలంటూ మతపెద్దలు అబ్దుల్, రెహమాన్, సిద్దిక్ తదితరులు అధికారులను ప్రశ్నించారు. గ్రామానికి చెందిన రెహమాన్, మీరాబీ దంపతుల కుమారై అమీద (07) చోడవరం మండలంలోని చెట్టుపల్లిలో ఉన్న తాతగారింటి వద్ద అడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయింది. బాలిక మృతదేహాన్ని స్వగ్రామం జాకేరుకు సోమవారం తీసుకొచ్చారు. ఖననం చేసే స్థలం లేదంటూ బాలిక మృతదేహంతో ముస్లిం పెద్దలు నిరసన తెలిపారు. దీనిౖపై తహసీల్దార్ రాములమ్మ మత పెద్దలతో ఫోన్‌లో మాట్లాడారు. శ్మశానం సమస్య తమ దృష్టికి ఇప్పటివరకు తీసుకురాలేదని, వీఆర్వోతో మాట్లాడి స్థలాన్ని గుర్తించి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన విరమించి గతంలో తమ పూర్వీకుల మృతదేహాలను ఖననం చేసే చెరువు సమీపంలో చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు.


