రెడ్‌బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట
ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు
చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కుమారుడు కిమిడి రామ్‌మల్లిక్ నాయుడుపై వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం చీపురుపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి పదవీ లేని రామ్‌మల్లిక్ నాయుడు ప్రభుత్వ భవనాలకు ప్రారంభోత్సవాలు చేయడం చట్ట విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. జెడ్పీ నిధులతో నిర్మించిన డీఎల్‌డీఓ కార్యాలయానికి 2025 డిసెంబర్ 4న ఏ హోదాలో ప్రారంభోత్సవం చేశారని ప్రశ్నించారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీపీ, జెడ్పీటీసీలు లేకుండా ప్రారంభోత్సవం చేయడం చట్టవిరుద్ధమని, ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు లో కోరారు. ఆధారాలు సమర్పించారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం/చీపురుపల్లి: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడగకూడదు.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించకూడదు.. చివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోకూడదు.. వైఎస్సార్‌సీపీ నాయకులు ఏం మాట్లాడినా.. చివరకు ప్రెస్‌మీట్ పెట్టినా నేరమేనట. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సరిగ్గా అదే జరిగింది. చీపురుపల్లిలోని రాజాం రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే రూ.12.99 కోట్ల నిధులు తీసుకొచ్చామని, పనులు కూడా అప్పట్లోనే 75 శాతం వరకు పూర్తయ్యాయని వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం మీడియా సమావేశంలో చెప్పడం నేరంగా ఇక్కడి పోలీసులు భావించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ సహా 35 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేసి.. వారందరికీ 41 నోటీసులు జారీచేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయం తెలిసి ‘ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడటం కూడా నేరమేనా?.. ప్రతిపక్ష నాయకులకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా ఇవ్వరా’ అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
క్రెడిట్ చోరీకి యత్నించి..
చీపురుపల్లిలోని రాజాం రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఆర్‌ఓబీ విషయంలో కొన్ని రోజులుగా కూటమి నాయకులు ఆ ఘనత అంతా తమదేనని క్రెడిట్ చోరీకి తెరలేపారు. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదివారం ఆర్‌ఓబీ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆ తరువాత మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలు వెల్లడించారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నేతలపై ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన ఎస్‌ఐ ఎల్.దామోదరరావు 35 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేసి.. వారందరికీ సోమవారం 41 నోటీసులు జారీ చేశారు.
పోలీసులను నిలదీసిన మాజీ ఎంపీ బెల్లాన
వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సోమవారం రాత్రి చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేయాలని, ఆ తరువాతే తమకు 41 నోటీసులు ఇవ్వాలని పట్టుబట్టారు. అనంతరం మీడియాతో మాజీ ఎంపీ బెల్లాన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు పెడుతున్న అక్రమ కేసులకు బెదిరేది లేదని కార్యకర్తలు, నాయకులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్ పెట్టారని మాజీ ఎంపీ బెల్లానతో సహా 35 మందిపై కేసు నమోదు
టీడీపీ నేతల ఫిర్యాదుతో వైఎస్సార్‌సీపీ నాయకుల నోరునొక్కే కుట్రలు
ఏ పదవీ లేకపోయినా ప్రారంభోత్సవాలు చేస్తున్న ఎమ్మెల్యే కుమారుడిపై
వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
పోలీసులు పట్టించుకోకపోవడంతో
మాజీ ఎంపీ ఆధ్వర్యంలో ఆందోళన
చీపురుపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత


