కుక్క కరిచి 10 మందికి గాయాలు
రామభద్రపురం: మండల కేంద్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. శుక్రవారం ఐదుగురు, శనివారం ఐదుగురు చొప్పున్న కుక్క కాటుకు గురై 10 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రధమ చికిత్స కోసం స్థానిక పీహెచ్‌సీకీ క్యూ కట్టగా అక్కడ సిబ్బంది ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి చికిత్ప అందించారు. ఇక్కడే కాదు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాలలో ఏ వీధిలో చూసినా గుంపులు, గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిని చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వీధుల్లోని పిల్లలు, వృద్ధులు, గొర్రెలు, మేకలు, ఆవుదూడలు, కోళ్లుపై దాడులు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా నియంత్రణ ఊసే లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఐటీఐ పాసైన వారికి లేటరల్ ఎంట్రీ అవకాశం
విజయనగరం గంటస్తంభం: ఐటీఐ రెండు సంవత్సరాల ట్రేడుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యుర్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించినట్టు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్‌బీటీఈటీ ఆధ్వర్యంలో నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పరీక్ష–2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 5లోగా జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్రిడ్జ్ కోర్సు శిక్షణ జనవరి 5 తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుందని, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 తేదీ నుంచి 7 తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు పాలిటెక్నిక్‌లో రెండో సంవత్సరానికి లేటరల్ ఎంట్రీ ప్రవేశానికి అర్హులని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, ఆధార్, ఐటీఐ సర్టిఫికెట్, పదో తరగతి, కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ విజయనగరం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
నెల్లిమర్ల రూరల్: మండలంలోని బొప్పడాం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ గణేష్ మాట్లాడుతూ గ్రామం నుంచి పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సహకారంతో తనిఖీలు చేపట్టామన్నారు. బొలేరో వాహనంలో తరలిస్తున్న మూడు వేల కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం నేరమని, ఇలాంటి చర్యలు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం
ఢీకొని ఇద్దరికి గాయాలు
మెంటాడ: మండలంలోని పిట్టాడ నుంచి మెంటాడ తహసీల్దార్ కార్యాలయానికి స్కూటీపై వస్తున్న సివిల్ సప్లయిస్ డీటీ సత్యనారాయణ, పిట్టాడ డీలర్ కుబిరెడ్డి శ్రీనివాసరావులను గుర్తు తెలియని వాహనం శనివారం అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీలర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలవ్వగా మెరుగైన వైద్యం కోసం తహసీల్దార్ వాహనంలో విజయనగరం తరలించారు. ట్రిపుల్స్‌తో వస్తున్న వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లి పోయారని బాధితులు తెలిపారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు
సంతకవిటి: మండలంలోని అక్కరాపల్లి గ్రామానికి చెందిన సోనయిల సన్యాసిరావు(40) గత నెల 22న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య వెంకటలక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 6309990875 నంబరును సంప్రదించాలని తెలిపారు.
కుక్క కరిచి 10 మందికి గాయాలు
కుక్క కరిచి 10 మందికి గాయాలు


