ప్రాణం నిలిపిన జీజీహెచ్ వైద్యులు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ప్రాణాలు నిలిపారు. గుర్ల గ్రామానికి చెందిన వడ్డాది అప్పారావు(75) తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మగత, స్పృహ లేకపోవడం వంటి పరిస్థితిలో సర్వజన ఆస్పత్రిలోని పలమనాలజీ విభాగంలో చూపించగా అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ధూమపానం అలవాటు ఉండడంతో చికిత్స అందించడం కూడా కష్టంగా మారింది. అతనికి చేసిన వైద్య పరీక్షల్లో లో బీపీ ఉన్నట్టు, గుండె పని చేయకపోవడం, సీఓపీడీ, నిమోనియా ఉన్నట్టు నిర్ధారించారు. ఐసీయూలో వారం రోజుల పాటు ఎన్‌ఐవీ వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్స అందించారు. అతను కోలుకోవడంతో శనివారం డిశ్చార్జ్ చేశారు. అప్పారావుకు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు నిలిపినందుకుగాను పలమనాలజిస్ట్ డాక్టర్ బొత్స సంతోష్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు.


