సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కె.కిరణ్‌కుమార్ అనే వ్యక్తి దీర్ఘకాలంగా (క్రానిక్ కాల్సిఫిక్‌ప్యాంక్రియాటైటిస్) అనే వ్యాధితో బాధపడుతూ తీవ్రమైన పొట్టనొప్పితో కొద్ది రోజుల క్రితం సర్వజన ఆస్పత్రిలో చేరాడు. కిరణ్‌కుమార్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్యాంక్రియాస్ గ్రంధిలో రాయిలా ఏర్పడిన కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్సలో భాగంగా ప్యాంక్రియాస్‌ను తెరిచి అందులో ఉన్న సుమారు 6 గీ6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న రాయిని జనరల్ సర్జరీ, మత్తు విభాగం వైద్యులు సమన్వయంతో విజవంతంగా తొలగించారు. అనంతరం ప్యాంక్రియాస్‌ను చిన్న పేగుతో అనుసంధానం చేసే (ప్యాంక్రియాటికో–జేజునోస్టమీ) అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా పొట్ట నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. కిరణ్‌కుమార్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. శస్త్రచికిత్సనిర్వహించిన జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ పీఏ.రమణి, డాక్టర్ చైతన్య బాబు, డాక్టర్ వెంకటనాయుడు, డాక్టర్ ఎన్.జగదీష్, డాక్టర్ ధర్మకిశోర్, డాక్టర్ శశిధర్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ హేమసుందర్, డాక్టర్ రామేశ్వరి ప్రభు డాక్టర్ రాకేష్, డాక్టర్ అరవిందసుప్రజలను సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు.


