ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందించండి
● కలెక్టర్‌ను కోరిన పారా
అంతర్జాతీయ క్రీడాకారుడు
విజయనగరం: జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు (పారా) ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని పారా అంతర్జాతీయ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు సోమవారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌తో కలిసి కలెక్టరెట్‌లో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు ఇప్పటివరకు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తీసుకుని వచ్చాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచాడని కలెక్టర్‌కు వివరించారు. భవిష్యత్ లో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్ధిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు.


