వ్యాన్ ఢీ కొనడంతో వ్యక్తికి గాయాలు
సీతానగరం: మండలంలోని హైవే రోడ్డుపై లచ్చయ్యపేట – పాత బొబ్బిలి మధ్య ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లికి చెందిన బొబ్బాది వెంకటరమణ ఆదివారం ఉదయం బొబ్బిలి వైపు నుంచి పాత బొబ్బిలి మీదుగా ద్విచక్ర వాహనం వాహనంపై లచ్చయ్యపేట వైపు వస్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీ కొనడంతో వెంకటరమణకు గాయాలయ్యాయి. వెంటనే వ్యాన్‌డ్రైవర్ 108 వాహనానికి ఫోన్ చేయగా.. సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడ్ని బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుడు తవిటినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొన్న లారీ..
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో పెదమానాపురం నుంచి వస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి తెలియజేసిన వివరాల ప్రకారం.. పెదమానాపురం నుంచి గర్భాం వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మామిడి నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు చొక్కపు అప్పలనాయుడు, అల్లు గోరమ్మకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజపతినగరం సీహెచ్‌సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


