జానపద కళలకు ఆదరణ
బొబ్బిలి: మనదేశ జానపద కళలకు, సంస్కృతికి ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ, టీవీ నటుడు షకలక శంకర్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోటలో బొబ్బిలి కళోత్సవ్ పేరిట జానపద కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ.. చరిత్రలో బొబ్బిలికి ప్రత్యేక స్థానముందన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీరత్వంపై ఓ పద్యాన్ని ఆలపించారు. అనంతరం రేలారేరేలా గాయకుడు కోరాడ జానకిరామ్ యువతను ఆకట్టుకునే గేయాలు ఆలపించారు. అంతకు ముందు రంగస్థలం ఫేమ్ తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృంద ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చెక్కకభజనలు, బుర్రకథ ప్రదర్శనలు, కోలాటం, జాలరిబాగోతం, థింసా నృత్యం, డప్పుల వాయిద్యం, జయదేవుని అష్టపది, బిందెల డాన్స్, సినీ నృత్యాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ రౌతు రామమూర్తినాయుడు, కోలాటం డ్యాన్స్ మాస్టర్ జి. కరుణ్‌కుమార్, శ్రీ కళాభారతి కార్యదర్శి నంబియార్ వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, స్థానిక కళాకారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
సినీ నటుడు షకలక శంకర్
జానపద కళలకు ఆదరణ


