రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
● ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమల
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ(జాతీయ మహిళా సమైక్య) రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.విమల ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అమర్‌భవన్‌లో ఆ సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ, జిల్లా కార్యదర్శి బుగత పావనిల ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట బాలికలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందన్నారు. ఇకనుంచి అయి నా మహిళలపై వివక్ష లేకుండా చూడాలని, వారిని అన్నిరంగాల్లో ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.


