ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే..
రాజాం: గతంలో కంటే దోమల బెడద ఎక్కువైంది. కలుషిత వాతావరణంతో పాటు ఎక్కడికక్కడే చెత్తాచెదారాలు పేరుకుపోవడం, మురుగు కాలువలు మూసుకుపోవడం వంటి కారణాలతో దోమల వ్యాప్తి అధికమైంది. గతంలో వేసవిలో మాత్రమే దోమల సమస్య పీడించేది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ దోమల బెడద ఉంది. పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్నిచోట్లా దోమలదండు కనిపిస్తోంది. అంతుపట్టని విష జ్వరాలను ఈ దోమలు వ్యాప్తి చేస్తున్నాయి. వీటి నిర్మూలనకు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.
పెరిగిన దోమల కాయిల్స్, రీఫిల్స్ వినియోగం
గతంలో దోమల నివారణకు ఎక్కువుగా దోమ తెరలు వినియోగించేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు అన్నిచోట్లా దోమల కాయిల్స్, రీఫిల్స్ వినియోగం పెరిగింది. ప్రతి ఇంట్లో దోమల చక్రాలు సాయంత్రం నుంచి వెలుగుతూనే కనిపిస్తున్నాయి. ఇక దోమల నివారణ రీఫిల్స్ వినియోగానికి హద్దే లేకుండా పోయింది. రాత్రి, పగలు తేడా లేకుండా రీఫిల్స్ వినియోగిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 50 మంది అంతకంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఒక రీఫిల్ వినియోగాన్ని చేపట్టాలి. అలా కాకుండా ఒకరిద్దరు ఉన్నచోట కూడా రాత్రింబవళ్లు రీఫిల్స్ వినియోగిస్తున్నారు. ఫలితంగా చాపకిందనీరులా వాయు కాలుష్యం జరుగుతోంది. దీంతో అంతుచిక్కని వ్యాధులు ప్రబలుతున్నాయి.
అమ్మో శ్వాసకోశ వ్యాధులు
గతంలో ఏ వెయ్యి మందిలో ఒకరికి శ్వాసకోశ వ్యాధులు ఆశించేవి. ఇప్పుడు అలా కాకుండా ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు. దోమల చక్రాలు, రీఫిల్స్‌లో వినియోగించే డైఇథైల్ టోలుమైడ్, పైరెత్రిన్, పైరిథ్రోయిడ్స్ వంటి రసాయనాలు మండి వాయుకాలుష్యం జరుగుతోంది. వీటిని పీల్చడం ద్వారా చర్మంపై అలర్జీలు, క్యాన్సర్ వంటి వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, నాడీ వ్యవస్థ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించలేక చాలా మంది జీవితం అర్ధంతరంగా ముగుస్తోంది.
విచ్చలవిడిగా దోమల నివారణ మందు వినియోగం తగదు
కాయిల్స్, రీఫిల్స్ అతి వినియోగం ప్రమాదకరం
చాపకింద నీరులా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధులు
ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందే..
ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే..
ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే..


