అంతా హడావుడే..!
● చేప పిల్లల విడుదలకు ఇదా సమయం..
● 546 చెరువుల్లో 14 లక్షల చేప పిల్లలు
● రానున్న వేసవికి నీరు అడుగంటే ప్రమాదం
● మత్స్యశాఖ తీరుపై అసంతృప్తి
సీతంపేట: మత్స్యశాఖాధికారులు హడావిడిగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. శనివారం నుంచి పలు గ్రామాల్లోని చెరువుల్లో పిల్లలు విడిచిపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మరికొద్ది నెలల్లో వేసవికాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పుడు చేప పిల్లలను చెరువుల్లో ఎలా విడిచిపెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వేసవిలో నీరు అడుగంటే అవకాశం ఉండడంతో చేప పిల్లలు ఎదుగుదల లేకుండా మధ్యలో చనిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఇవి ఎంతవరకు రైతులకు ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పాలకొండ నియోజకవర్గ పరిధిలో 546 గిరిజనులకు చెందిన చెరువుల్లో 14 లక్షల చేపలు వేయడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారుల గణాంకాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా చేప పిల్లల పంపిణీకి కొద్ది రోజుల కిందట టెండర్లు నిర్వహించగా.. ఎల్‌వన్ బిడ్డర్ టెండర్ దక్కించుకున్నారు. ఐటీడీఏ నిధులు సుమారు రూ.15 లక్షల వరకు ఇందుకోసం వెచ్చించనున్నారు. సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లోని చెరువుల్లో చేప పిల్లలు వేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సగానికి పైగా చెరువులు అడుగంటగా, మిగతా చెరువుల్లో నీరు ఉంది. అన్ని చెరువులూ మార్చి నెలాఖరుకు అడుగంటుతాయి. జూన్, జూలై నెలల్లో చెరువుల్లో చేప పిల్లలు వేయాల్సి ఉండగా..ఇప్పుడు వేయడం ఏం ప్రయోజనమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మత్స్యశాఖ జిల్లా అభివృద్ధి అధికారి
ఏమన్నారంటే...
ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సంతో
ష్‌కుమార్ వద్ద ప్రస్తావించగా టెండర్లు ఆలస్యం కావడం వల్ల చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందన్నారు. వర్షాలు ఈ దఫా బాగా పడడంతో చెరువుల్లో నీరు ఉందన్నారు. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడే చేప పిల్లలు వేయనున్నట్లు చెప్పారు.


