గంజాయి రవాణాకు అడ్డుకట్ట..
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణకు అడ్డుకట్ట వేశామని ఎస్పీ దామోదర్, కలెక్టర్ ఎం. రామసుందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక దండుమారమ్మ టెంపుల్‌లో జిల్లా స్థాయి పోలీస్ సిబ్బందితో వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి రవాణా, పోక్సో కేసు నమోదుపై జిల్లా శాఖ దృష్టి సారించిందన్నారు. పోక్సో నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలోనే కాకుండా సబ్ కోర్టుల్లో కూడా శిక్షలు పడుతున్నాయన్నారు. గతేడాది పోక్సో కేసులు 58 నమోదైతే.. ఈ ఏడాది 57 నమోదయ్యాయని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై 87 కేసులు నమోదు చేసి 270 మందిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుల నుంచి 1,175 కిలోల గంజాయిని సీజ్ చేశామని.. 54,15,860 రూపాయల ఆస్తి రికవరీ చేశామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. వరకట్న వేధింపులు గతేడాది 241 నమోదైతే ఈ ఏడాది 267 నమోదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే హత్యకేసులు గతేడాది కంటే పెరగడం బాధాకరమని తెలిపారు. మొత్తానికి గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని 2024లో 7,352 జరిగితే ఈ ఏడాది 4,880 కేసులు నమోదు అయ్యాయన్నారు. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ శాఖాధికారులు పాల్గొన్నారు.


