ప్రాణాంతక వ్యాధితో చిన్నారి పోరాటం..
● ఆపన్నహస్తాల కోసం ఎదురుచూపు..
● వైద్యానికి రూ. 12 లక్షలు అవసరం
భోగాపురం: మండలంలోని రెడ్డికంచేరు గ్రామానికి చెందిన బైరెడ్డి సురేష్‌రెడ్డి, శైలజ దంపతులకు ఈ నెల 8న కుమారుడు జన్మించాడు. అయితే వారసుడు వచ్చాడన్న ఆనందం వారికి ఎంతోసేపు నిలువలేదు. చిన్నారికి ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో వారి ఆనందం ఆవిరైంది. వివిధ ఆస్పత్రుల్లో చిన్నారిని చూపించినా, ఆరోగ్యం కుదుటపడలేదు. ఇందుకోసం రూ. లక్షల్లో ఖర్చు చేశారు. చివరగా విశాఖపట్నం అపోలో ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. చికిత్స కోసం సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం అంత సొమ్ము ఎలా పోగు చేయాలో తెలియక దేవుడిపై భారం వేసి ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 83744 67856, 93901 41053 నంబర్లను సంప్రదించాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే విషయం తెలుకున్న వైఎస్సార్‌సీపీ సర్పంచ్ బైరెడ్డి రమణరెడ్డి, శీరపు వంశీరెడ్డి, బైరెడ్డి దుర్గయ్యరెడ్డి, చిన్నయ్యరెడ్డి చిన్నారి తండ్రి సురేష్‌రెడ్డిని శనివారం కలిసి రూ. 21 వేల నగదు అందజేశారు.


