దివ్యాంగ విద్యార్థికి అరుదైన అవకాశం
● ఎవరెస్ట్ శిఖర అధిరోహణ శిక్షణకు ఎంపిక
పూసపాటిరేగ : మండల కేంద్రానికి చెందిన దివ్యాంగ విద్యార్థి కందివలస సంతుకు అరుదైన అవకాశం వచ్చింది. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు ఇచ్చే బేస్ క్యాంప్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ మేరకు బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరాంమూర్తి క్రీడా ప్రాంగణంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ శిక్షణకు ఎంపికలు జరిగాయి. విశాఖపట్టణం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఎంపికలు జరిగాయి. పోటీలకు వందల సంఖ్యలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రత్యేక అవసరాలు పిల్లలు హాజరయ్యారు. జిల్లా నుంచి పలువురు విద్యార్థులు పాల్గొనగా పూసపాటిరేగకు చెందిన కందివలస సంతు ఎవరెస్ట్ శిఖర అధిరోహణ శిక్షణకు ఎంపికయ్యారు. సంతు గత నెలలో జరిగిన పారా ఒలింపిక్స్ పోటీలలో రెండు బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సంతు పూసపాటిరేగ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంతును కళాశాల ప్రిన్సిపాల్ ఎం.హనుమంతురావుతో పాటు అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు. కోచ్ మరియు ఎస్కార్ట్‌గా వ్యవహరించిన ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎన్.బంగారునాయుడును పలువురు అభినందించారు.


