26న సమైక్య తెలుగు దినోత్సవం
విజయనగరం: తెలుగు భాషా పరిరక్షణ సమితి, సమైక్య భారతి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి సంయుక్తంగా ఈ నెల 26వ తేదీన సమైక్య తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో గల మహాకవతి గురజాడ అప్పారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్మరణ నేపథ్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, ఏకపాత్రాభినయం పోటీలు, వందేమాతరం గేయానికి 150 ఏళ్ల నేపథ్యంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలను జిల్లా కేంద్రంలో వివిధ పాఠశాలల్లో ఇప్పటికే నిర్వహించామని తెలిపారు. విజేతలుగా నిలిచిన వందమంది విద్యార్థులకు 26న కేఎల్ పురంలోని గీతాంజలి పాఠశాలలో బహుమతి ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవంలో లయ లాస్య డ్యాన్స్ అకాడమీకి చెందిన బెల్లాన రాజు నృత్య దర్శకత్వంలో విద్యార్థులు నృత్య ప్రదర్శన గావిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త పి.కన్నయ్య, సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముళ్ళపూడి సుభద్ర దేవి, విశ్రాంత ఉపాధ్యాయులు దేవరశెట్టి శ్రీరామమూర్తి, డిమ్స్ రాజు తదితరులు పాల్గొన్నారు.


