● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం చర్యలు ● కనీస సౌకర్యాలు, రక్షణ శూన్యం ● వెళ్లేందుకు రహదారీ కరువే | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం చర్యలు ● కనీస సౌకర్యాలు, రక్షణ శూన్యం ● వెళ్లేందుకు రహదారీ కరువే

Dec 25 2025 6:14 AM | Updated on Dec 25 2025 6:14 AM

● జిల

● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు య

● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం చర్యలు ● కనీస సౌకర్యాలు, రక్షణ శూన్యం ● వెళ్లేందుకు రహదారీ కరువే జలపాతాలు ఘనం.. సౌకర్యాలే కనం! వెళ్లేందుకు మార్గమే లేదు..

కొన్ని ఘటనలు..

దళాయివలస జలపాతం

ఆనందం వెంటే.. ప్రమాదం

సాక్షి, పార్వతీపురం మన్యం :

జిల్లాలో సహజ వనరులకు కొదవ లేదు. కొండకోనలు, జాలువారే జలాపాతాలతో ఆహ్లాదం పంచుతుంది. వీటిని సద్వినియోగం చేసుకుంటే.. జిల్లాను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయవచ్చు. గత కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ప్రస్తుత కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి.. జిల్లా పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించారు. అందులో భాగంగా బాహ్య ప్రపంచానికి తెలియని జలపాతాలను వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పించారు. ప్రస్తుత కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. బాధ్యతలు స్వీకరించినది మొదలు.. జిల్లాలో ఉన్న జలపాతాలను వెలికి తీసి.. పర్యాటకులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని సీతంపేట, సాలూరు, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో దండిగాం, దళాయివలస, సున్నపుగెడ్డ, మెట్టుగూడ, మల్లి, బెనరాయి, తాడికొండ, శిఖపరువు, కురుకుట్టి, లొద్ద, తోణాం వంటి ప్రధాన జలపాతాలు 20 వరకు ఉన్నాయి. కొండలు, గుట్టలతో ఆ ప్రాంతాలు చూపురులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పిక్నిక్‌ల సమయంలో ఈ కేంద్రాలన్నీ కిటకిటలాడుతాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పం మంచిదే అయి నా.. అక్కడికి వెళ్లేందుకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో చేసే ప్రయత్నాలన్నీ వృథాగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

అటవీశాఖ అనుమతులున్నవెన్ని?

అటవీశాఖ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా పర్యాటకంగానూ, ఇతర పనులు చేపట్టాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లాలో జలపాతాల గుర్తింపు, అభివృద్ధి అంటూ హడావిడి చేస్తున్న యంత్రాంగం.. అటవీశాఖ అనుమతులు లేకుండానే చాలా వరకు పనులు చేపట్టేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వ ర్యంలో సున్నపుగెడ్డ వద్ద జలపాతానికి రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆర్చ్‌ ఏర్పాటు చేశారు. ఇంకొంత పనులున్నాయి. మిగిలిన ఎక్క డా ఆ శాఖ కనీస అనుమతులు కూడా లేనట్లు తెలుస్తోంది. సంబంధం లేని డీఆర్‌డీఏ శాఖను ఇందులో భాగస్వామ్యం చేయడం విమర్శలకు తావిస్తోంది.

●ఎకో టూరిజం ప్రకారం ఎకో డెవలప్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానికులకే శిక్షణ ఇచ్చి గైడ్స్‌గా నియమించాలి. పర్యాటకుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారికి జీతాలు, అక్కడ సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తారు. కొండకోనల ప్రాంతంలో జంతువులు సంచరించే అవకాశం ఉంటుంది. తగిన హెచ్చరిక, రక్షణ చర్యలు తీసుకోవాలి. జలాపాతాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. కనీస నిబంధనలు పాటించాలి. చాలా వరకు జలాపాతాల వద్ద ఇవేవీ అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

●దళాయివలస, శిఖపరువు వద్ద టికెట్‌ పెట్టి మనిషి వద్ద రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ఎవరి ఖాతాలోకి వెళ్తుందో తెలియడం లేదు.

రామభద్రపురం మండలానికి చెందిన హరిబాలకృష్ణ అనే యువకుడు స్నేహితులతో కలసి ఈ నెల 7వ తేదీన సాలూరు మండలం దళాయివలస వద్దనున్న జలపాతానికి వచ్చాడు. రోజంతా సరదాగా గడిపాడు. అక్కడ ఈత కొడుతూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

గతంలో దోనుబాయి జలపాతం వద్ద గల ఊటకుంటలో పడి ఓ పర్యాటకుడు ప్రాణాలు వదిలాడు.

మెట్టగూడ వద్ద ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థి జారిపడి, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

శిఖపరువు వద్ద గతంలో పలు ప్రమాదాలు జరిగాయి. రాళ్ల మీద పడి గాయాలపాలైన వారు అనేక మంది ఉన్నారు. ఇవి కొన్ని ఘటనలు మాత్రమే. జలాపాతాల వద్ద పర్యాటకుల భద్రత, రక్షణకు యంత్రాంగం తీసుకున్న చర్యలు శూన్యం. ముఖ్యంగా యువత మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంతమంది మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారు.

ఆహ్లాదం వెంటే ప్రమాదం కూడా పొంచి ఉంది. యువత, పిల్లలు జలకాలాడుతూ, పై నుంచి రాళ్ల ద్వారా కిందకు జారుతున్నారు. ఈ సమయంలో గాయాలపాలవుతున్నారు. యువత ఎక్కువగా మద్యం మత్తులోనే ఉంటారని స్థానికులు చెబుతుంటారు. తాగిన మత్తులో ప్రమాదకర ప్రాంతంలోకి ఈతకు దిగి, మునిగిపోయిన సందర్భాలు అనేకం. ఇవేకాక.. జంఝావతి రబ్బర్‌ డ్యాం, తోటపల్లి ప్రాజెక్టు వద్ద కూడా పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. జంఝావతి రబ్బర్‌డ్యాం వద్ద ఇటీవలే విహార యాత్రకు వెళ్లి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జలపాతాలు, ప్రాజెక్టుల వద్ద కనీస రక్షణ చర్యలు ఉండటం లేదు. హెచ్చరిక బోర్డులు పెట్టినా.. యువత వినిపించుకునే పరిస్థితి లేదు.

సాలూరు మండలంలోని లొద్ద జలపాతం అద్భుతంగా ఉన్నా అక్కడకు వెళ్లేందుకు రోడ్డు లేదు. గత ఏడాది అక్టోబర్‌లో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. సందర్శకులకు మట్టి రోడ్డే దిక్కవుతోంది. ప్రస్తుత కలెక్టర్‌, గత కలెక్టర్‌ కూడా ఈ మట్టి రోడ్డు మీదే వెళ్లారు.

కురుకుట్టి జలపాతానికి కూడా రహదారి సౌక ర్యం లేదు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం పొలాల మధ్య నుంచి వెళ్లాలి.

దండిగాం వద్ద గతంలో పవర్‌ ప్రాజెక్టు మంజూరు అయ్యింది. తర్వాత అది రద్దు అయ్యింది. ఆ సమయంలో కొంత అభివృద్ధి చేసి వదిలేశారు. దండిగాం గ్రామం నుంచి వందమీటర్లు నడిస్తే జలపాతం వస్తుంది. దానిని కూడా అభివృద్ధి చేయకుండా వదిలేశారు.

దళాయివలస ప్రాంతంలో గిరిజనులు సొంతంగా ముందుకొచ్చి, వెదురుతో నిర్మాణాలు చేశారు. దుకాణాలు పెట్టారు. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. వారు సొంతంగా చేసుకున్న దానికి ప్రస్తుత ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి రిబ్బన్‌ కట్‌ చేసి తమ గొప్పగా చెప్పుకోవడాన్ని చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు. రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే.. సందర్శకులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డును కూడా అక్కడి గ్రామస్తులే వేసుకోవడం గమనార్హం. జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట ప్రాంతాల్లో ఉన్న జలపాతాలదీ ఇదే పరిస్థితి.

● జిల్లాలో జలపాతాలను  పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు  య1
1/3

● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు య

● జిల్లాలో జలపాతాలను  పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు  య2
2/3

● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు య

● జిల్లాలో జలపాతాలను  పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు  య3
3/3

● జిల్లాలో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement