ఆదివాసీ కుటుంబంపై రాజకీయ కక్ష
మాసగూడలో జేసీబీతో తమపూరిపాక ముందు పునాదుల తవ్విన చోట విలపిస్తున్న ఆదివాసీ కుటుంబం
భామిని: మండలంలోని మాసగూడలో నిరుపేద ఆదివాసీ గిరిజన కుటుంబంపై అదే గ్రామానికి చెందిన కూటమి నాయకుడు కక్షగట్టాడు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని లాక్కుని అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణానికి పూనుకున్నాడు. దీంతో దివ్యాంగుడైన బిడ్డిక ఈనత్తు, భార్య లక్ష్మి దంపతులతో పాటు ముగ్గురు కుమారులు వీధినపడ్డారు. బిడ్డిక లక్ష్మిపేరున గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇంటి స్థలాన్ని మంజూరు చేసింది. అందులో పూరిపాక వేసుకుని గిరిజన కుటుంబం నివసిస్తోంది. కొత్తగా కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పీఎం జన్‌మాన్ పథకంలో పక్కాగృహం మంజూరైందని హౌసింగ్ అధికారులు చెప్పడంతో ఇంటి నిర్మాణం కోసం రాళ్లుకూడా తెప్పించుకున్నారు. ఇది చూసిన కూటమి నాయకుడు కక్ష పెంచుకున్నాడు. వారు నివసిస్తున్న పూరిపాక స్థలంలో కొత్తగా వచ్చిన మినీ అంగన్‌వాడీ భవనం నిర్మాణం పేరున జేసీబీతో బుధవారం పునాదులు తవ్వించారు. వాస్తవంగా అంగన్‌వాడీ భవన నిర్మాణానికి వేరే దగ్గర పొజిషన్‌సర్టిఫికేట్‌ను కూడా అధికారులు ఇచ్చారు. అయితే, దివ్యాంగుడి కుటుంబంపై ప్రతీకారంతో అధికారులపై వత్తిడి తెచ్చి మరీ గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం తలపెట్టడంపై బాధిత కుటుంబంతో పాటు గిరిజన సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్తామని బాధితులు తెలిపారు.
జగనన్న ఇచ్చిన
ఇంటి స్థలంలో
అంగన్‌వాడీ
కేంద్రానికి పునాది
వీధిన పడిన
దివ్యాంగుడి
కుటుంబం
ఆదివాసీ కుటుంబంపై రాజకీయ కక్ష


