సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
● విజయవంతంగా ఆపరేషన్ చేసి కేన్సర్ కణితి తొలగింపు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవంతంగా ఆపరేషన్ చేసి రోగి కడుపులో నుంచి కేన్సర్ కణితిని తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ మంగళవారం వెల్లడించారు. రక్తహీనత, కిడ్నీ వాపు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో దుక్క రమణ అనే వ్యక్తి కొద్ది రోజులు క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే వైద్యులు రోగికి రక్తహీనతకు అత్యవసర చికిత్స అందించారు. అనంతరం నిర్వహించిన పలు వైద్య పరీక్షల్లో ఆయకు రెట్రోపెరిటోనియల్ సాప్ట్ టిష్యూ సార్కోమా అనే అరుదైన కేన్సర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. శస్త్రచికిత్సకు ముందు రోగి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చికిత్స అందించారు. కిడ్నీ వాపును తగ్గించేందుకు యూరాలజిస్ట్ సహాయంలో మూత్ర నాళంలో స్టెంటింగ్ నిర్వహించారు. తదుపరి జనరల్ సర్జరీ, యురాలజీ విభాగాల వైద్యులు, మత్తు వైద్యులు సమన్వయంతో రెట్రోపెరిటోనియల్ కణితిని (రెండు కేజీలు) తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని అత్యవసర చికిత్స విభాగంలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి కేన్సర్ చికిత్స అందించారు. రోగిని కేన్సర్‌తో పాటు కేన్సర్ వల్ల వచ్చే క్లిష్ట పరిణామాల నుంచి కూడా సురక్షితంగా కాపాడగలిగారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న జనరల్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ పి.ఎ.రమణ, డాక్టర్ చైతన్యబాబు, డాక్టర్ శశిధర్, డాక్టర్ సుదర్శన్‌లను సూపరింటెండెంట్ అభినందించారు.


