వైద్యసేవలు వేగవంతం.. పారదర్శకతే లక్ష్యం
● విశాఖ జోనల్ సమీక్షలో హెల్త్
సెక్రటరీ సౌరబ్‌గౌర్
పార్వతీపురం రూరల్: వైద్యారోగ్య శాఖలో పారదర్శకతను పెంచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల వీసీ సమావేశ భవనంలో నిర్వహించిన ఉత్తర కోస్తా జిల్లాల ఆరోగ్య సమీక్షా సమావేశానికి పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు తన వైద్యబృందంతో హాజరయ్యారు. జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరు, ప్రగతి నివేదికలను కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. కార్యాలయం వ్యవహారాలన్నీ ఇకపై ఈ–ఆఫీసు ద్వారానే నిర్వహించాలని, ప్రతి నివేదికను డిజిటలైజేషన్ చేయడం ద్వారా పర్యవేక్షణ సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మాతృ మరణాల విషయంలో కచ్చితమైన జవాబుదారీ తనం ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులు, పోర్టల్‌లను పరిశీలిస్తూ వైద్య సేవలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి. జగన్మోహనరావు, డాక్టర్ రఘు కుమార్, డాక్టర్ ఎం. వినోద్ కుమార్, డాక్టర్ కౌశిక్, డీపీఓ లీలారాణి, ఏఓ మణిరత్నం తదితర సిబ్బంది పాల్గొన్నారు.


