పక్కా ప్రణాళికతో హత్య
● భీముడు మృతిపై సమగ్ర విచారణ జరపాలి
● ఎస్పీకి మృతుడి భార్య వినతి
పార్వతీపురం రూరల్: రికార్డుల్లో గుండెపోటు..శరీరంపై మాత్రం గాయాల అనవాళ్లు..వెరసి గొర్రె భీముడు(52) మృతి మిస్టరీగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి భార్య భారతి, ఆదివాసీ ఎరుకల సంఘాల నాయకులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించింది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడకు చెందిన భీముడు గత ఏప్రిల్ 22న వంశధార నది ఒడ్డున విగతజీవిగా లభ్యమయ్యాడు. మృతదేహంపై కంటి భాగం, పక్కటెముకల వద్ద గాయాలున్నా..పోస్టుమార్టం నివేదికలో గుండెపోటుగా పేర్కొనడంపై బాధితులు మండిపడ్డారు. గ్రామంలో చెత్త బండి నడిపే విషయంలో స్థానికంగా కొందరితో విభేదాలున్నాయని, వారే కులం పేరుతో దూషించి, దాడి చేసి చంపేశారని భారతి ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై సాక్షులున్నా పోలీసులు పట్టించుకోలేదని, పైగా హడావుడిగా అంత్యక్రియలు చేయించారని వాపోయింది. హైకోర్టు ఆదేశించినా న్యాయం జరగలేదని, తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యుడిపై, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.శంకరరావు, యూటీఎఫ్ అధ్యక్షుడు కె.సంజయ్‌బాబు, ఏపీఏవైఎస్‌ఎస్ నేతలు జి.శ్రీనివాసరావు, ఎస్.ముసలయ్య, ఎం.పోతురాజు, గొర్ల సత్యం,చల్ల చిన్నారావు, గొర్ల సన్యాసిరావు, గొర్ల రమణమూర్తి, గేదెల ఆదినారాయణ, గేదెల సురేంద్ర, గొర్ల బుల్లోడు తదితరులు పాల్గొన్నారు.


