
మధ్యవర్తిత్వానికి విశేష స్పందన
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న 90 రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత తెలిపారు. గత మూడు నెలల్లో జిల్లా కోర్టులో ఉన్న మధ్యవర్తిత్వ కేంద్రంలో 30 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్‌బౌన్స్, వాణిజ్యపరమైన తగాదా కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఎన్నాళ్లనుంచో వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తలు మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా ఒక్కటయ్యారన్నారు.
రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డు
బొబ్బిలి: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ గత నెల 15 నుంచి ఈ నెలాఖరు వరకూ ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ ప్లాన్ సిమ్ కార్డులకు మంచి స్పందన లభించిందని, రూపాయికే సిమ్ కార్డును అందజేస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌డీఈ యు.ఎలియా తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. ఫ్రీడం ప్లాన్ తీసుకున్నవారికి అపరిమిత కాల్స్‌తో పాటు డైలీ 2జీబీ నెట్ సౌకర్యం లభిస్తుందన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి జిల్లాలో 9,119 సిమ్ కార్డులను విక్రయించి నట్టు తెలిపారు. ఫైబర్ నెట్ ద్వారా రూ. 400లకే టీవీచానల్స్‌ను అందజేస్తున్నామన్నా రు. జిల్లా వ్యాప్తంగా 2జీ–157, 3జీ–10, 4జీ–285 సెల్ టవర్లున్నట్టు వెల్లడించారు.
యూరియాకు తప్పని తిప్పలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సీతారామునిపేట సచివాలయం వద్ద ఎరువుల కోసం రైతులు గురువారం పడిగాపులు కాశారు. యూరియా అందజేస్తామని వ్యవసాయశాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఆర్‌ఎస్‌కే పరిధిలో ఉన్న సుమారు 300 మంది రైతులు ఉదయం 9 గంటలకే సచివాలయం వద్దకు వచ్చి క్యూలో నిల్చొన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు లైన్‌లో నిల్చొని ఉన్నా ఎరువు అందజేయలేదు. మధ్యాహ్నం 4 గంటల సమయంలో 130 బస్తాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. చాలామంది రైతులు ఎరువు దొరకక నిరాశతో వెనుదిరిగారు.
పూసపాటిరేగ: మండలంలోని కుమిలి గ్రామంలోని ఆర్‌ఎస్‌కేకు ఎరువుకోసం 400 మంది రైతులు చేరుకోగా కేవలం 266 బస్తాలే సరఫరా చేశారు. ఎరువు అందక మిగిలిన రైతులు కూటమి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వెనుదిరిగారు.

మధ్యవర్తిత్వానికి విశేష స్పందన

మధ్యవర్తిత్వానికి విశేష స్పందన

మధ్యవర్తిత్వానికి విశేష స్పందన