
కార్మికులకు వరం ఈ–శ్రమ్
విజయనగరం గంటస్తంభం: శ్రామికులకు వెన్నుదన్ను..విపత్కర వేళ తోడుగా నిలిచేది ఈ–శ్రమ్ కార్డు. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–శ్రమ్ కార్డు పొందడం పూర్తిగా ఉచితమైనా అవగాహన లోపం వల్ల చాలా మంది ప్రయోజనాలకు దూరంగా ఉంటున్నారు. టైలర్లతో సహా చాలా రంగాలకు చెందిన శ్రామికులు ఈ–శ్రమ్ కార్డు పొందడానికి అర్హులు. నమోదు కూడా సులభం. ఈ–శ్రమ్‌లో నమోదైన కార్మికులు, వలస కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పలు ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ డేటాబేస్ ఆధారంగా ఉపాధి,నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారు. నిజంగా శ్రామికుల పాలిట‘ ఈ–శ్రమ్’ ఓ వరం వంటిదని చెప్పవచ్చు. కార్మికశాఖ ఎంత కసరత్తు చేస్తున్నా ఇంకా పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ–శ్రమ్ కార్డు పొందలేదు. ఈ–శ్రమ్ నమోదు కోసం ప్రత్యేకంగా ఆగస్టు 25 తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
కార్డు ఎలా పొందాలి?
ఈ–శ్రమ్ కార్డు పొందడం చాలా సులభం. కంప్యూటర్‌పై అవగాహన ఉన్నవాళ్లు ‘ఈ–శ్రమ్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సొంతంగా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు, మీ–సేవ, సీఎస్‌సీ సెంటర్లలో వివరాలను నమోదు చేసుకుని కార్డు పొందవచ్చు. బ్యాంకు అకౌంట్ నంబర్, అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డు, ఫొటో ఉంటే సరిపోతాయి. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత సెల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. కార్డును ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
అర్హులెవరంటే..?
అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, వలస కార్మికులు, చిన్న, సన్నకారు, కౌలు రైతులు, కూలీలు, పశుపోషణ, వడ్రంగి, ఉప్పు తయారీ, ఇటుకబట్టీ, రాతి క్వారీ కార్మికులు, పనిమనుషులు, క్షురకులు, కూరగాయలు, పండ్ల విక్రేతలు, చేతివృత్తుల వాళ్లు, వీధి వ్యాపారులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, టైలర్లు, మత్స్యకారులు, నర్సరీ కూలీలు, ఉపాధి కూలీలు, భవననిర్మాణ కార్మికులు, పాల వ్యాపారులు, కొరియర్, పేపర్ బాయ్స్, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, సెరికల్చర్, హమాలీలు, హోంమెయిడ్స్, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌లో సభ్యత్వం లేనివారు, ఆదాయపు పన్ను పరిధిలో లేనివాళ్లు అర్హులు. 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

కార్మికులకు వరం ఈ–శ్రమ్

కార్మికులకు వరం ఈ–శ్రమ్