
స్మార్ట్ కార్డులు సరే.. సరుకులేవీ?
విజయనగరం ఫోర్ట్: ఓ వైపు రాష్ట్ర ఖజనాలో డబ్బులు లేవని కూటమి ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. మరోవైపు గత ప్రభుత్వ ఆనవాళ్లను దూరం చేసేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నది జనం మాట. దీనికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీయే నిలువెత్తు నిదర్శనం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన రైస్ కార్డులు బాగానే ఉన్నా ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి స్మార్ట్ కార్డుల పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5,73,137 రైస్ కార్డులు ఉన్నాయి. వీరికి కూటమి సర్కారు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తోంది. దీనికోసం రూ.6 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నట్టు సమాచారం. స్మార్ట్ కార్డులపై ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు ఇచ్చే నిత్యావసర వస్తువులపై లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ఏడు నెలలుగా కందిపప్పు సరఫరా నిలివేసి... ఇప్పుడు కార్డులంటూ కొత్త డ్రామాకు తెరతీయడాన్ని దుయ్యబడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.130 నుంచి రూ.140 వరకు ఉంది. రేషన్ షాపుల్లో రాయితీపై కేజీ రూ.67 చొప్పున అందించేవారు. జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు అందజేసేందుకు నెలకు 5,73,137 కిలోల కందిపప్పు అవసరం. ఈ లెక్కన నెలకు రూ.7 కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడు నెలలుగా కందిపప్పు ఇవ్వక పోవడం వల్ల రూ.35 కోట్లు వరకు కూటమి ప్రభుత్వం భారం తగ్గించుకుంది. పేదలకు పప్పును దూరం చేసింది. బయటమార్కెట్‌లో కొనుగోలు చేసుకుంటున్న రేషన్ లబ్ధిదారులపై ఆర్థిక భారం పడుతోంది.