
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: భారీ వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజినీర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. నదీతీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లాలో సగటున 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. కొత్తవలస, గంట్యాడ, నెల్లిమర్లలో ఎక్కువ వర్షం పడిందని చెప్పారు. ఎస్.కోట, నెల్లిమర్ల మండలాల్లో బుధవారం అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పారిశుద్ధ్య పనులతో పాటు తాగునీటి సరఫరా, వైద్యశిబిరాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.