● గతంలో కర్రపెత్తనం చేసిన పెద్దాయన
● ఇప్పుడు ‘కళ’తప్పిన రాజకీయం ● ముదురుకేసులను పక్కనబెట్టిన చినబాబు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఆ రోజుల్లో ఆయన రాజకీయ ‘కళ’.. రాజసమే వేరు.. పెద్ద ఎన్టీఆర్ ముందే బుర్రుమని కుర్చీ లాక్కొని దిలాసాగా కూర్చునే రోజులు.. తనకు నచ్చిన మంత్రి పదవి.. ఇష్టమైన పోర్టుఫోలియో ఎదురుగా తన పేరు రాసుకునే చనువు.. పెద్దరికం.. ఐదారు ఖాళీ బీ ఫారాలు చేతిలో పట్టుకుని తనకు నచ్చినవాళ్ల పేర్లు రాసుకునే వెసులుబాటు.. మునకాల కర్ర పట్టుకుని వీధుల్లో ధీమాగా నడుస్తూ పెత్తనం సాగించే కామందుకు ప్రతిరూపం. కానీ కాలం మారింది. ఆ రోజులన్నీ పెద్ద ఎన్టీఆర్‌తోనే పోయాయి. పెత్తనం సాగించిన ఇలాంటి చాలా మునకాలకర్రలను ఈ కొత్త జనరేషన్ మూలనబడేసింది. చినబాబు పాలనలో పెద్దరికాలకు ఫుల్‌స్టాప్ పడింది. పార్టీ పదవులు.. నామినేటెడ్ పదవులు.. మంత్రి పదవులు.. ఇలా సర్వం చిన్నబాబు అనుమతితో... సమ్మతితోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తనకంటూ ప్రత్యేకవర్గాన్ని.. టీమ్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ కొత్త పాలసీలో భాగంగా సీనియర్లను పెద్దలు అంటూ ట్యాగ్ మేడలో వేసేసి పక్కనబెట్టారు. పోనీ సీనియర్ కదాని గౌరవించి పదవి ఇస్తే పాతకాలపు వాసనలతో ఆయన పెత్తనం చేస్తారు తప్ప చినబాబు వద్ద అణిగిమణిగి ఉండడం కష్టమన్న భావన. ఇంకా గట్టిగా మాట్లాడితే నాది మీ తాతతరం.. మీ తాత రేంజి అంటూ మంత్రుల అందరిమధ్య క్లాస్ పీకుతారేమోనన్న భయం. నువ్వు పుట్టకముందే నేను హోమ్ మంత్రిని అనే మాట అనేసినా అనేయొచ్చు. అందుకే ఎందుకొచ్చిన బుర్రబాధ అనుకుంటూ పెద్దతలకాయలను పక్కనబెట్టేశారన్నది జనంమాట. రాజకీయ ‘కళ’తో ముందుకు సాగిన పెద్దాయన ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎక్కువ.. మంత్రికి తక్కువ అనే ప్రత్యేక హోదాలో చేసీచేయని రాజకీయం చేస్తున్నరన్నది పెద్దవిమర్శ. నిత్యం రాజాంలో సొంత ఇంట్లో ఉంటూ బోర్ కొట్టినప్పుడు అలా తన నియోజయకవర్గానికి వెళ్లి ఏవో ఒకట్రెండు అధికారిక కార్యక్రమాలకు హాజరై మళ్లీ రయ్యిమంటూ రాజాం వెళ్లిపోతున్నారు. ఆయన వ్యవహార శైలి గురించి తెలిసిన కార్యకర్తలు కూడా ఆయన మీద ఆశలు పెట్టుకోలేదు.. ఇది తనకు అలవాటైన తీరు కాబట్టి ఆయనా ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోలేదు. మొత్తానికి ఒకనాడు బాగా పెత్తనం చెలాయించిన మునకాలకర్రలను చినబాబు ఇలా మూలబెట్టేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ నలుగురు కార్యకర్తలు గుమికూడినా దీనిపైనే గుసగుసలాడుతున్నారు.