
84,998 హెక్టార్లలో పంటల సాగు
● కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరంఫోర్ట్: జిల్లాలో ఇప్పటివరకు 84,998 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరిగిందని, వీటికి 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 25,605 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. తన చాంబర్‌లో వ్యవసాయ, మార్కెఫెడ్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం 2,339 మెట్రిక్ టన్నుల యూరియా, 1330 మెట్రిక్ టన్నుల డీఏపీ రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉందన్నారు. ఈ నెలఖారులో 3వేల టన్నుల యూరియా అవసరం ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎరువుల దుకాణాలు, ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లను తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సీఎస్‌డీటీ బృందాలతో తనిఖీ చేయిస్తామన్నారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, వ్యవసాయశాఖ జేడీ తారకరామారావు, మార్కెఫెడ్ డీఎం వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.