
తోటపల్లి కాలువలో జారి పడి వ్యక్తి మృతి
తెర్లాం: తోటపల్లి ప్రధాన కుడికాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయిన ఓ వ్యక్తి మృతి చెందాడు. తెర్లాం మండలంలోని కవిరాయునివలస గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, తెర్లాం ఎస్సై బి.సాగర్‌బాబు తెలిపిన వివరాలి లా ఉన్నాయి. సింగిరెడ్డివలస గ్రామానికి చెందిన జమ్మల శంకరరావు(50) శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో తోటపల్లి ప్రధాన కుడికాలువ పక్కకు బహిర్భూమికి వెళ్లాడు. కాలువలో దిగి పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి నీటిలో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిపోయాడు. కొద్దిసేపటికి గ్రామస్తులు పొలం పనులకు తోటపల్లి కాలువ వైపు వెళ్తూ నీటిలో పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి వెంటనే బయటకు తీసి పడిపోయిన వ్యక్తి తమ గ్రామానికి చెందిన జమ్మల శంకరరావుగా గుర్తించారు. అప్పటికే శంకరరావు మృతి చెందడంతో బంధువులు, గ్రామస్తులకు, తెర్లాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తెర్లాం ఎస్సై సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య అప్పమ్మ, ఇద్దరు వివాహితులైన పిల్లలు ఉన్నారు. వారు ముగ్గురు చైన్నెకి కూలిపనుల నిమిత్తం వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మృతదేహానికి బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుతో మహిళ..
సంతకవిటి: మండలంలోని మల్ల య్యపేట గ్రామానికి చెందిన మూల అమ్మడు(49) పాముకాటుకు గురై మరణించినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఎప్పటిలాగానే అమ్మడు భర్త వెంకటరావుతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా పొలంలో ఆమెను పాము కాటు వేయడంతో శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించింది. ఈ ఘటనపై మృతురాలి భర్త వెంకటరావు శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని ఎస్సై తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి ఆత్మహత్య?
బొబ్బిలిరూరల్: మండలంలోని ఎం.బూర్జివలస గ్రామ సమీపంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. గ్రామానికి చెందిన సన్యాసమ్మ అనే మహిళ అదే దారిలో వెళ్తుండగా కొంత దూరంలో ఎవరో చెరువులో దూకినట్లు కనిపించిందని స్థానికులకు తెలియజేయడంతో స్థానికు సమాచారంతో ఎస్సై రమేష్ తన బృందంతో వచ్చి గాలింపు చేపట్టారు. ఈతగాళ్లను చెరువులో దింపి గాలింపు చేపట్టినప్పటికీ ఎవరి మృతదేహం లభ్యం కాలేదు.దీంతో నిజంగా జరిగిందా? లేక అపోహ? అన్న కోణంలో పోలీసులు స్థానికులను విచారణ చేశారు. చూసిన మహిళ వృద్ధురాలు కావడంతో నీటి బాతులను చూసి చెప్పి ఉంటుందని కొంతమంది, నిజంగా జరిగితే పరిస్థితి ఏమిటని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు కొనసాగుతునే ఉంది. చెరువులో ఎటువంటి అచూకీ లభ్యం కాలేదని ఎస్సై రమేష్ తెలిపారు.
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ స్టేషన్ పరిధి రంగిరీజువీధికి చెందిన తాడి శంకరరావు(68) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వన్‌టౌన్ సీఐ చౌదరి శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శంకరరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. భర్త శంకరరావు ఆత్మహత్యపై భార్య ఆరోపణలు చేయగా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని సీఐ తెలిపారు.

తోటపల్లి కాలువలో జారి పడి వ్యక్తి మృతి

తోటపల్లి కాలువలో జారి పడి వ్యక్తి మృతి

తోటపల్లి కాలువలో జారి పడి వ్యక్తి మృతి