● ఆర్‌అండ్‌బీ ఏఈ బి.రాజేంద్ర కుమార్
● సాక్షి కథనానికి స్పందన
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రం నుంచి కొరాపుట్ వైపు వెళ్లేందుకు ఉన్న అంతర్‌రాష్ట్ర రహదారిపై గుంతలకు వారంలోగా మరమ్మతులు చేపడతామని ఆర్‌అండ్‌బీ ఏఈఈ బి. రాజేంద్రకుమార్ అన్నారు. ఈనెల 19న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘‘చెరువులను తలపిస్తున్న రోడ్లు’’ అనే శీర్షికకు ఆయన స్పందిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రహదారి విస్తీర్ణం నిమిత్తం రూ.17కోట్లు మంజూరవగా అందులో భాగంగా 4/0 కిలోమీటర్ల నుంచి 12/8 కిలోమీటర్ల వరకు విస్తీర్ణ పనులు పూర్తయ్యాయన్నారు. అయితే 2023 నుంచి బిల్లులు చెల్లింపు నిలిచిపోయాయని, ఇటీవల బకాయి బిల్లులు చెల్లింపులు జరగడంతో త్వరలో పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
పోలయ్య ఆచూకీ లభ్యం
సంతకవిటి: మండలంలోని చిత్తారపురం పంచాయతీ పోడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య(76) గత ఆదివారం ఉదయం నాగావళి నదిలో గల్లంతయ్యాడు. పోలయ్య ఆచూకీ లభించకపోవడంతో గత మంగళవారం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చేపట్టగా శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెద్ద బొడ్డేపల్లి వద్ద ఓ మృతదేహం ఒడ్డుకు రావడంతో స్థానికులు అక్కడి వీఆర్‌ఓకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలయ్య కుటుంబసభ్యులు వెళ్లి మృతదేహం పోలయ్యదేనని గుర్తించినట్లు వీఆర్‌ఓ అన్నారావు, పోలీస్ సిబ్బంది తెలిపారు.