
బాల్యంపై బ్యాగుల బరువు
వీరఘట్టం: ప్రతి శనివారం బ్యాగు మోత లేకుండా విద్యార్థులకు ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనంతో పాటు సామాజిక అంశాలపై పట్టు సాధించేలా బోధన చేపట్టి ఒక్క శనివారం మాత్రం నో బ్యాగ్ డే పాటించేలా చర్యలు తీసుకుంటామని ఇటీవల ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటన ఇంత వరకు అమల్లోకి రాలేదు. నేటి కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు బ్యాగుల బరువు మోత తప్పడం లేదు. ఆధునిక బోధన విధానంలోనూ చిన్నారులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం లేదన్న విమర్శలున్నాయి. ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు కనిపించడం లేదు. ఉత్సాహాన్నిచ్చే వాతావరణానికి దూరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ఈ వాస్తవాలను ఒప్పుకుంది. చిన్నారులను బరువుల మోత నుంచి బయట పడేయాలని సూచనలు చేసింది. కానీ ఎక్కడా ఇది అమలుకు నోచుకోవడం లేదు.
ఆందోళనలో చిన్నారుల పరిస్థితి
కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం 70 శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు. కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది. అతి చిన్న వయస్సులోనే నీరసం, భుజాలు వంగి పోవడం సర్వ సాధారణమైంది. 90 శాతం మందికి ఏడు గంటల నిద్ర కరువే. దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతోంది. బహుళ అంతస్తుల భవనాల్లో ప్రైవేట్ బడులు ఉంటున్నాయి. బరువు వేసుకుని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలొస్తున్నాయి.
అమలు కాని నిబంధనలు..
పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది. చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్ధితి మరే దేశంలోనూ లేదని బరువుపై అధ్యయనం చేసిన యశ్‌పాల్ కమిటీ చెప్పింది. అధిక బరువు వల్ల కండరాలపై ఒత్తిడి పడి భవిష్యత్త్‌లో దీర్ఘకాల సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. డిజిటల్ బోధన మేలని సూచించాయి. అయితే కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్లుతున్నా..మనం ఆ దిశగా అడుగులేయడం లేదు. మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేసే దిక్కులేదు.
ప్రతి శనివారం అమలు కాని నో–బ్యాగ్ డే
కంప్యూటర్ కాలంలోనూ విద్యార్థులకు కష్టాలు
బ్యాగు బరువుతో అకెక్కిన ఆటలు
చిన్నారుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు
పట్టించుకోని విద్యాశాఖ