
ప్రభుత్వ స్థలంలో కూటమి నేత కబ్జా
● అక్రమంగా షెడ్డుల నిర్మాణం
● షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసమని ఆరోపణలు
గంట్యాడ: అధికారం ఉందని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికార దర్పంతో ఎక్కడ స్థలం కనబడినా అక్రమిస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. అధికారులు కూడా అఽధికార పార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలు అక్రమించుకున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమణ కళ్లెదుట కనిపిస్తున్నా తమకు ఏమీ కనబడడం లేదన్న విధంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అందులోనూ మంత్రి సొంత మండలంలో తమను ఎవరు ఏమీ అనరనే ధీమాతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖరీదైన స్థలం కొట్టేసే ప్లాన్..
మండలంలోని నరవ గ్రామం జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. దీంతో ఇక్కడ స్థలాలకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ప్రభుత్వ స్థలాలపై కన్ను వేశారు. జాతీయ రహదారిని అనుకున్న ప్రభుత్వ స్థలం అక్రమించి ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం షెడ్డు కూడా వేసేశారు. ఈ రోడ్డు గుండానే తహసీల్దార్ నుంచి వీఆర్వో వరకు అందరూ రాకపోకలు సాగిస్తారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణం గురించి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. కూటమి నేత అక్రమించిన స్థలం విలువ సుమారు గా రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీంతో సదరు నేత సొంత స్థలం మాదిరి షెడ్డులు వేసి షాపులు నిర్మించేసి అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు వరకు గొప్పలు చెబుతున్నారు. కానీ అపార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలను అక్రమించుకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ స్థలంలో షెడ్డు నిర్మించినట్టు నా దృష్టికి వచ్చింది. తక్షణమే చర్యలు తీసుకుంటాం.
పి.నీలకంఠేశ్వర రెడ్డి, తహసీల్దార్, గంట్యాడ