
మహిళా ముద్దాయికి యావజ్జీవ శిక్ష
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన జంటహత్యల కేసులో భీమిలి మండలం నగరపాలెం ప్రాతానికి చెందిన జ్యోతిర్మయి (34)కి జీవితఖైదు, దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పాడరాము (38), చొక్కా నరేష్ (42), ఉప్పాడ గ్రామానికి చెందిన మరో ఇద్దరు ముద్దాయిలకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ విజయనగరం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి అప్పలస్వామి తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. కేసు వివరాల్లోకి వెళ్తే..భీమిలికి చెందిన జ్యోతిర్మయికి నగరపాలెం గ్రామానికి చెందిన రమేష్‌తో వివాహం జరగ్గా వారికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే దిబ్బవాని పాలెం గ్రామానికి చెందిన పాడ రాముతో జ్యోతిర్మయి వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త రమేష్ చైన్నెలో సీ మన్‌గా ఉద్యోగం చేస్తూ తిరిగి వచ్చే క్రమంలో భార్య వివాహేతర సంబంధం బయటపడింది. ఈ విషయంపై భర్త ప్రశ్నించినందుకు ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను జ్యోతిర్మయి హతమార్చి మృతదేహాన్ని భీమిలి సముద్రంలో పడేసింది. ఆ సమయంలో ఆరేళ్ల కూతురు ఇంట్లో జరిగిన దారుణాన్ని చూడడంతో చిన్నారిని కూడా పకడ్బందీగా విజయనగరం తీసుకొచ్చి కొత్తపేట బావిలో పడేసింది. 2015 జూలై 26 ఈ ఘటన జరగడంతో అప్పటి టూ టౌన్ సీఐ అంబేడ్కర్ కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో భాగంగా టూ టౌన్ సీఐ ప్రాసిక్యూషన్ పూర్తి చేసి అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేయడంతో కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు పైవిధంగా కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురామ్, సీఐ శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్ లక్ష్మి, ఏఎస్సై మల్లేశ్వరరావులు క్రియాశీలకంగా పనిచేశారని ఎస్పీ తెలిపారు.
భర్త, కూతురి హత్య