
వైభవంగా శ్రావణమాస పూజలు
● ప్రత్యేక పుష్పాలంకరణలో మహాలక్ష్మి
● అమ్మవారి సన్నిధిలో శతసహస్ర నామ కుంకుమార్చన
నెల్లిమర్ల రూరల్: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా జిల్లాలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అర్చకులు సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే రామస్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. అనంతరం ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలు, గంధంతో అభిషేకాలు జరిపించారు. సుమారు 30 మంది వైష్ణవ ఋత్విక్కులతో శత సహస్రనామ కుంకుమార్చన వైభవంగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ ఉమా సదాశివాలయంలో కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, మల్లికార్జున శర్మ, కిరణ్, పవన్, రామగోపాలాచార్యులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రావణమాస పూజలు