
అనాథలైన అమ్మానాన్నలు
● పుట్టిన గ్రామంలోనే భిక్షాటన చేసుకుంటూ జీవనం
● లక్షల విలువైన ఆస్తులను దక్కించుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన పిల్లలు
లక్కవరపుకోట: అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు నాడు బిడ్డలా? అన్నట్లు తయారైంది వృద్ధులైన ఆ దంపతుల పరిస్థితి. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నా అనాథల్లా రోడ్ల వెంబడి పిచ్చివారిలా తిరుగుతూ ఏవరైనా పెట్టింది తింటూ షాపుల ముందు పడుకుంటూ ఆ దంపతులు పడుతున్న దీనస్థితి కలిచివేస్తోంది. నలుగురు పిల్లలను కని పెంచి ప్రయోజకులుగా చేసిన ఆ తల్లిదండ్రులు అనాథల్లా మిగిలిపోయారు. ఈ దీనగాథ ఇలా ఉంది. లక్కవరపుకోట మండల కేంద్రానికి చెందిన సంఘం అప్పలనారాయణ, చిన్నమ్మలు భార్యాభర్తలు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాయగూరల వ్యాపారం చేస్తూ పిల్లలను పెంచి వారికి పెళ్లిళ్లు, పేరంటాలు జరిపించారు. అలాగే చిన్నమ్మలుకు తన కన్నవారి కుటుంబం నుంచి కొంత ఆస్తికూడా కలిసి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయగా వారు అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. కొడుకులిద్దరూ తన తల్లి కన్న వారి ఇంటి నుంచి వచ్చిన భూమిని లక్షల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. తీరా ప్రస్తుతం ఆదంపతులు వృద్ధాప్యంలోకి చేరడంతో వారి ఆలనా పాలన పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ దంపతులు మతిస్థిమితం లేక ఇద్దరూ చెరో దారిలో పడి రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు..ఠి