
రామతీర్థంలో వైభవంగా పూర్ణాహుతి
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో రామాయణంలో పట్టాభిషేకం సర్గ హవనం చేసి పూర్ణాహుతి జరిపించారు. ఆలయంలోని వెండి మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద నిత్య కల్యాణం జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
భక్తి శ్రద్ధలతో తిరువాయ్ మోజి సేవాకాలం:
విజయనగరం పట్టణానికి చెందిన పలువురు మహిళా భక్తులు స్వామి సన్నిధిలో తిరువాయ్ మోజి సేవాకాలాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోష్ఠి ప్రతినిధి రమాదేవి ఆధ్వర్యంలో తిరువాయ్ నామాలను పఠించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, రామగోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.