
మందు బిళ్లలూ కరువే..!
విజయనగరం ఫోర్ట్:
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెబుతున్న కూటమి పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు కావాల్సిన కనీస మందులను కూడా సరఫరా చేయలేకపోతున్నారు. చివరకు చిన్నపాటి వ్యాధులకు వాడే మందు బిల్లలు సైతం రోగులకు అందించలేని పరిస్థితి. పాలకులు చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉంది. హోమియో, ఆయుర్వేద వైద్యానికి మంచి ఆదరణ ఉంది. దీంతో రోగులు ఆయా వైద్యశాలలకు బాగానే వెళ్తున్నారు. కానీ అక్కడ వైద్యుడి ఓపీ మాత్రమే ఉచితంగా లభిస్తుంది. జబ్బు తగ్గ్గే మందులు మాత్రం రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నెలల తరబడి మందులు లేకపోయినా కూటమి సర్కార్ మందులు సరఫరా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆయుర్వేదంలో మందుల పరిస్థితి
ఆయుర్వేద వైద్యశాలలో సోరియాసిస్ వ్యాధికి, మధుమేహాం, కీళ్ల నొప్పులు, గైనిక్ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, మూత్ర వ్యాధులు, న్యూరాలజికల్ సమస్యలు, రుమథైడ్ ఆర్థరైటీస్, శ్వాసకోశ సమస్యలు, ఎలర్జీ, దగ్గుకి సంబంధించిన మందులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రస్తుతం లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యుడికి చూపించుకున్న తర్వాత మందులు గది వద్దకు వెళ్లిన రోగులు అక్కడ మందులు లేకపోవడంతో ప్రైవేటు మందులు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. గత కొంత కాలంగా ఇదే పరిస్థితి ఉంది. మందుల కోసం ఆయుర్వేద వైద్యశాల వైద్యులు ఇండెంట్ పెట్టినా ఇంతవరకు మందులు సరఫరా కాలేదని తెలుస్తుంది. బీపీ మిషన్ పాడవ్వడంతో బీపీ చూసే పరిస్థితి లేదు. షుగర్ మిషన్ లేకపోవడంతో పరీక్షించే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ వైద్యశాలకు నెలలో కనీసం 1500 వరకు రోగులు వస్తారు.
హోమియోలో కూడా..
హోమియో వైద్యానికి కూడా ప్రస్తుతం సమాజంలో మంచి ఆదరణ ఉంది. దీంతో రోగులు నిత్యం హోమియో వైద్యశాలకు అధికంగానే వస్తారు. ఈ వైద్యశాలకు కూడా 1500 నుంచి 1800 మంది వరకు రోగులు వస్తారు. అయితే హోమియోలో కూడా చాలా వ్యాధులకు మందులు లేవు. ఏడాది కాలంగా మందులు లేకపోయినా కూటమి సర్కార్ సరఫరా చేయని పరిస్థితి. హోమియోలో సీ్త్రల వ్యాధులకు, షుగర్ వ్యాధికి, చర్మ వ్యాధులకు, దీర్ఘకాలిక వ్యాధులకు మందుల్లేవు.
అల్లోపతిలో..
అల్లోపతిలో కూడా మందుల కొరత ఉంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆస్పత్రులు, జిల్లా ఆసుపత్రులకు ప్రభుత్వం సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి మందులు సరఫరా చేస్తుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు మందులు సకాలంలో సరఫరా కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో పలు రకాల మందులు కొరత ఉన్నట్టు తెలుస్తుంది. నైట్రోగ్లిజరిన్ (మత్తు ఇంజక్షన్), సెఫడ్రాక్సిన్ (యాంటీ బయాటిక్), నైట్రో ఫిరోటోయాన్ (యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌కు), ఆపరేషన్ థియేటర్స్‌లో ఉపయోగించే డై థెరమి ఎర్త్‌ప్యాడ్, మెట్రోనోజోల్ (యాంటీ బయాటిక్ మాత్రలు), టెనిగ్లిప్టిన్ 20 ఎంజీ షుగర్ మాత్రలు, విటమిన్ కె ఇంజక్షన్, బ్లీడింగ్ కంట్రోల్‌కు ఉపయోగించే ఇధాలిసిటేట్ ఇంజక్షన్, గాబపెట్టిన్ మాత్రలు(మూర్ఛ వ్యాధికి) ల్యాబ్ ఎటలాల్ ఇంజక్షన్ తదితర రకాల మందులు లేనట్టు తెలుస్తుంది.
మందుల్లేవు...
చాలా వరకు మందులు అయిపోయాయి. మందుల కోసం ఆరు నెలల కిందట ఇండెంట్ పెట్టాం. ఇంకా రాలేదు. రాగానే అన్ని ఆసుపత్రులకు వాటిని పంపిస్తాం.
– ఎం.ఆనందరావు, వైద్యాధికారి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల
– జి.వరప్రసాద్, వైద్యాధికారి, ప్రభుత్వ హోమియో వైద్యశాల
విజయనగరం పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మోకాళ్ల నొప్పులతో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు కొద్ది రోజులు క్రితం వెళ్లాడు. అక్కడ మందులు లేకపోవడంతో ప్రైవేటు ఆయుర్వేద మందుల దుకాణంలో కొనుగోలు చేశాడు.
–––––––––––––––––––––––––––
విజయనగరం మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళ చర్మ సంబంధిత వ్యాధితో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్లారు. అక్కడ వైద్యుడు రాసిన మందులు లేకపోవడంతో ప్రైవేటు ఆయుర్వేద మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేశారు.
–––––––––––––––––––––––––––
గంట్యాడ మండలానికి చెందిన అప్పలసత్యం విజయనగరంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలకు వెళ్తే అక్కడ వైద్యుడు రాసిన మందులు లేకపోవడంతో ప్రైవేటు మందుల దుకాణంలో కొనుగోలు చేశాడు.
అల్లోపతి, హోమియో, ఆయుర్వేద వైద్యానికి మందుల కొరత
ప్రైవేటు ఆసుపత్రులు, షాపుల్లో కొనుగోలు చేస్తున్న రోగులు
కూటమి పాలనలో ఆసుపత్రుల్లో
మందుల పరిస్థితి ఇదీ..!

మందు బిళ్లలూ కరువే..!

మందు బిళ్లలూ కరువే..!