
విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం పెరగాలి
విజయనగరం అర్బన్: విద్యార్థికి కళాశాల దశ నుంచి పరిశోధనా దృక్పథం పెరగాలని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి అన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఏటీఎల్ మెంటార్‌షిప్ ప్రోగ్రాంను గురువారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి కేంద్రిత పరిశోధన, ప్రాజెక్టులకు యూనివర్సిటీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీడీఈ కార్యదర్శి అండ్ సీఈవో ప్రొఫెసర్ ఎంఎల్‌ఎస్ దేవ్‌కుమార్ మాట్లాడు తూ విద్యార్థుల్లో ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంకేతిక మెంటార్‌షిప్ అభివృద్ధికి ఏటీఎల్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు పాల్గొన్నారు.
నేడు డయిల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో
విజయనగరం అర్బన్: జిల్లాలో అమలులో ఉన్న సీ్త్ర శక్తి పథకం ద్వారా అందిస్తున్న మహిళల ఉచిత ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవడానికి శుక్రవారం డయిల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీవో) వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ ఇబ్బందులు, సూచనలను 9959225604 నంబరుకు తెలియజేయాలని సూచించారు.
4వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం : కలెక్టర్
విజయనగరం అర్బన్: స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ నెల 23న నాల్గో శనివారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. డ్రైన్ క్లీనింగ్, పారిశుధ్యం ప్రధానాంశంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీ సచివాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వివిధ అంశాలపై గురువారం సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా స్థాయిలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో స్వచ్ఛాంధ్ర సంస్థలు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడడం, దోమల నివారణకు మందులు స్ప్రే చేయడం, నీటి నాణ్యతలకు పరిశీలించడం, పాఠశాలల్లో హ్యాండ్ వాష్‌పై అవగాహన కలిగించడం తదితర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.