
టీడీపీలో రగిలిన అసమ్మతి
శృంగవరపుకోట: మండలంలోని కృష్ణమహంతిపురం పీఏసీఎస్ కార్యవర్గం నియామకంతో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అసమ్మతి కుంపటి రాజుకుంది. పీఏసీఎస్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం బహిష్కరించిన ఆ పార్టీ నేతలు గురువారం గరవపాలెం గ్రామంలో సమావేశమై పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. పీఏసీఎస్ డైరెక్టర్ పదవిని తిరస్కరించిన పెంటకోట రమణబాబు సహా ఐదు పంచాయతీల పరిధిలోని నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. 750 మంది రైతులున్న సొసైటీలో కేవలం 20 మంది రైతులున్న పంచాయతీకి చెందిన వ్యక్తిని చైర్మన్‌గా ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. పార్టీ అంటే ఇద్దరు వ్యక్తులదేనా... ఏంటీ ఈ పంపకాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులిస్తే పార్టీకి అదనపు బలం చేకూరాలని...ఇక్కడ అలా జరగడం లేదని ఆగ్రహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం బహిష్కరించడం బాధ కల్గించినా తప్పలేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని రమణబాబు తదితరులు తెలిపారు. ఒంటెద్దు పోకడ నిర్ణయాలు భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూర్చుతాయన్నారు. సమావేశంలో ఎంపీపీ ఎస్.సోమేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఒంటి అప్పారావు, సర్పంచ్ యాళ్ల రమణ, ఎంపీటీసీ బోదల దేముడు, ఆడారి సూరిఅప్పారావు, అల్లూరి సత్యనారాయణరాజు, ఐ.శ్రీనివాసరాజు, ఆడారి అప్పారావు, యర్రపాటి సూర్యనారాయణ, కాండ్రేగుల విశ్వేశరరావు, డీవీఏ నారాయణరావు, లగుడు లక్ష్మి, చల్ల రాము, పెంటకోట కృష్ణతో పాటూ పలువురు మాజీ ఎమ్పీటీసీలు, వార్డు సభ్యులు ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాజరై నిరసన వ్యక్తం చేశారు.