విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్యకళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుముతో సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదివిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. తదుపరి ఎంపీసీ, చివరి ప్రాధాన్యం ఇతర గ్రూపుల వారికి ఇవ్వనున్నట్లు చెప్పారు.
పేకాట ఆడుతున్న ఇద్దరు కార్పొరేటర్ల అరెస్ట్
విజయనగరం క్రైమ్: పేకాట ఆడుతుండగా ఇద్దరు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లను టూటౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సై కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్టేషన్ క్రైమ్ పార్టీ నైట్‌డ్యూటీలో భాగంగా పేకాటరాయుళ్లను పట్టుకున్నారన్నారు. తమ స్టేషన్ పరిధిలోని మంటపం వీధిలో మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బంగారు నాయుడు, రంగ.రామకృష్ణలతో పాటు స్వాతికుమార్, భాస్కర్, తాడి సురేష్, నాగేంద్రలను పట్టుకున్నామన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు. పట్టుబడిన పేకాటరాయుళ్ల దగ్గర నుంచి రూ.48 వేల 810 నగదుతో పాటు 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.