
బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!
ఇతని పేరు సూరెడ్డి సత్యనారాయణ. ఇతనిది మెంటాడ మండలం లోతు గెడ్డ. ఇతనికి 3.8 ఎకరాల పొలం ఉంది. అందులో వరి పంట సాగు చేశారు. వరి పంటకు యూరియా వేద్దామంటే దొరకక అవస్థలు పడుతున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు విశ్వనాథం రాంబాబు. ఎల్.కోట గ్రామం. ఈయన 6 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. అందులో వరి పంట సాగు చేశాడు. వరి పంటకు యూరియా వేయడానికి గత నాలుగు రోజులుగా తిరుగుతున్నాడు. అయినప్పటికీ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సిరపురపు రామునాయుడు. ఇతనిది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగుచేశాడు. వరి పంటకు వేసేందుకు అవసరమైన యూరియా కోసం గత ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ లభ్యంకాలేదు.
ఈయన పేరు తాళ్లపూడి అప్పలనాయుడు. ఇతనిది బొండపల్లి మండలం రోళ్ల వాక గ్రామం. ఇతనికి రెండు ఎకరాల పొలం ఉంది. వరి పంట వేశాడు. యూరియా దొరకక దిక్కులు చూస్తున్నాడు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లా రైతులను యూరియా కొరత వెంటాడుతోంది. అదునుకు ఎరువు దొరకకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. పనులు మానుకుని ఎరువు కోసం పరుగు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్నమొన్నటి వరకు వరుణుడి కరుణలేక పంటలు సాగుపై రైతులు బెంగ పెట్టుకున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పంటల సాగుకు ఉపక్రమించారు. పంటకు ఎరువు వేద్దామంటే దొరకని పరిస్థితి. డీఏపీ ఎరువు కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఎరువుల దుకాణాలు, ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. బాబ్బాబు.. ఎరువు ఇప్పించండి అంటూ అధికారులను ప్రాథేయపడుతున్నారు.
వీడని ఎరువు కష్టాలు
టీడీపీ ప్రభుత్వం ఎప్పడు అధికారంలో ఉన్నా రైతన్నకు కష్టాలు తప్పవని వాపోతున్నారు. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఎరువుల కోసం చేసిన ధర్నాలు, నిరసనలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పడు కూడా రైతులు ఎరువుల కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొంది. అన్నదాతకు అండగా నిలుస్తాం. ఎరువుల కొరతరానివ్వం అంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పి ఇప్పుడు కనిపించడమే మానేశారని విమర్శిస్తున్నారు.
యూరియా నిల్...
జిల్లాలో 505 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. 200 మంది వరకు ప్రైవేటు డీలర్లు ఉన్నారు. వీరి చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకని పరిస్థితి. జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 24,300 మెట్రిక్ టన్నులు వచ్చింది. ప్రస్తుతం ఎక్కడా యూరియా నిల్వలు లేవు. డీఏపీ 9,300 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 8,900 మెట్రిక్ టన్నులు వచ్చింది. డీఏపీ కూడా ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు.
విక్రయించాం
యూరియా జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల అవసరం కాగా ఇప్పటి వరకు 24,300 మెట్రిక్ టన్నులు వచ్చింది. యూరియా అంతా విక్రయించడం జరిగింది. రెండు మూడు రోజుల్లో యూరియా రాగానే రైతులకు అందజేస్తాం.
యూరియా బస్తా
ఈ ఫొటోలో మండుతున్న ఎండలో నేలపై కూర్చొని ఉన్నది విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస గ్రామ రైతులు. యూరియా కోసం పనులు మానుకుని కుంటినివలస రైతుసేవా కేంద్రం వద్ద బుధవారం గంటల తరబడి నిరీక్షించారు. ఇచ్చిన ఒక బస్తా యూరియా కూడా వీరిలో చాలా మందికి దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
యూరియా కోసం అన్నదాత అవస్థలు
ఆర్‌ఎస్‌కేల వద్ద గంటల తరబడి
నిరీక్షణ
డీఏపీ కూడా దొరకని పరిస్థితి
32వేల మెట్రిక్ టన్నులకు 24,300 మెట్రిక్ టన్నులే సరఫరా

బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!

బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!

బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!

బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!

బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!

బాబ్బాబు... యూరియా ఇప్పించండి..!