
ఎంత భూమి ఉన్నా ఒక బస్తా ఎరువేనా?
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరాలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక మొత్తం చెల్లించడంతో పాటు అవసరం లేని కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ఎరువులు సక్రమంగా సరఫరా చేయాలని సూచించారు. జిల్లా పరిషత్‌లో 1–7వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన బుధవారం జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూరియా కొరత ఉందని, రైతులు ఇబ్బంది పడుతున్నారని సభ్యులు తెలిపారు. ఎకరా ఉన్న రైతుకు, 10 ఎకరాలు ఉన్న రైతుకి ఒకటే యూరియా బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు జిల్లాలు వ్యవసాయ శాఖ జేడీలు మాట్లాడుతూ రెండు రోజుల్లో యూరియా వస్తుందని తెలిపారు.
● ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతూ, అర్హత ఉన్న దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి పింఛన్లు రద్దు చేయడం అన్యాయమని పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు. మక్కువ, గజపతినగరం మండలాల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు మావుడి శ్రీనివాసరావు, గార తవుడు అర్హులకు జరిగిన అన్యాయంపై డీఆర్‌డీఏ పీడీ దృష్టికి వివరాలతో తీసుకెళ్లారు. పింఛన్ల రద్దును నిలిపివేయాలని కోరారు. దీనిపై జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అర్హతలేని వారికి పింఛన్ నిలిపివేసినా అర్థం ఉంటుందని, ఎక్కువ శాతం దివ్యాంగత్వం ఉన్న వారికి పింఛన్లు నిలిపివేయడం తగదని, తక్షణమే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
● జిల్లాలో రైతాంగానికి అవసరమైన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో జాప్యంపై చైర్మన్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. సకాలంలో విద్యుత్ కనెక్షన్లు జారీచేయకపోతే రైతులు పంటలను ఎలా సాగుచేస్తారన్నారు. సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఉమ్మడి జిల్లాలకు చెందిన అధికారులు, వైస్ చైర్మన్ మరిసర్ల బాపూజీనాయుడు, సభ్యులు కె.సింహాచలం, సంకిలి శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల కొరత లేకుండా చూడాలి
ఎకరా ఉన్నా, పది ఎకరాలున్నా ఒక బ్యాగు ఇస్తే ఎలా సరిపోతుంది
అర్హుల పింఛన్లు పునరుద్ధరించాలి
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

ఎంత భూమి ఉన్నా ఒక బస్తా ఎరువేనా?