బొబ్బిలిరూరల్: బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి కొత్తబట్టివలస గిరిజన గ్రామానికి చెందిన గర్భిణి సీదరపు గౌరమ్మకు మంగళవారం పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యు లు డోలీలో సుమారు 5 కిలోమీటర్ల మేర నిండుగర్భిణిని మోసుకుని గోపాలరాయుడుపేట వద్దకు చేర్చారు. అక్కడ నుంచి 108 వాహనంలో పిరిడి పీహెచ్‌సీకి తరలించారు. ఆమె సాధారణ ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు సేవలు అందిస్తున్నారు. పురిటినొప్పులు వేళ వైద్యసేవలు అందకపోవడంతో నిండుగర్భిణి ఆక్రందనలు కూటమి నాయకులకు వినిపించకపోవడం విచారకరమని గిరిజన నాయకులు మండిపడ్డారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల రమణి, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ గిరిజనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నామన్న ప్రభు త్వం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతోందని విమర్శించారు. గిరిజనులకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డోలీలమోత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెపండగ పనులను పప్పు బెల్లాల్లా పంచుకుతిన్న కూటమి నాయకులు గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని మరిచిపోయారని ఆరోపించారు. కోట్లాది రూపాయల ఉపాధిహామీ నిధులతో సొంత ప్రయోజనకర పనులను చక్కబెడుతూ గిరిజనులకు డోలీ కష్టాలను మిగుల్చుతున్నారన్నారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.