
జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది
● వణుకు పుట్టిస్తున్న మశకాలు
● రోజురోజుకు పెరుగుతున్న దోమకారక జ్వరాలు
● నేడు ప్రపంచ దోమల నివారణ దినం
సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో దోమలు విజృంబిస్తున్నాయి. మలేరియా, డెంగీలతో పాటు అక్కడక్కడ చికెన్‌గున్యా వంటి జ్వరాలను వ్యాప్తి చేస్తూ నిత్యం వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యేలా చేస్తున్నాయి. వాటి నివారణకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా రోజురోజుకు దోమల తీవ్రత పెరుగుతూనే ఉంది. పట్టణాలతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ఈనెల 20న ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
దోమల దినంగా ఎందుకంటే..
ప్రపంచానికి కామన్ శత్రువుగా మారిన దోమల ఆట కట్టించడానికి సర్ రోనాల్డ్ రాస్ శతాబ్దం క్రితమే రంగంలోకి దిగి 1897లో దోమల ద్వారానే మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించారు. ఈ పరిశోధనకు గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజెనిక్ అండ్ ట్రాపికల్ మెడిసన్ ఈసందర్బాన్ని పురస్కరించుకుని ఆగస్టు 20న అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించింది.
అరికట్టేదెలా..
దోమ ఎగురుతున్నపుడు పట్టుకోవడం, చంపడం చాలా కష్టమైన పని. ఒక్క దోమను పట్టుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కానీ దోమలు నీటిలో లార్వా, ప్యూపా దశలో పెరుగుతున్నప్పుడు వాటిని నాశనం చేయడం చాలా సులువు. ఇవి ఇంటిలో నీటిని నిల్వ చేసే కుండీల్లో చిన్నచిన్న పురుగుల్లా కనిపిస్తుంటాయి. వాటిని చాలా మంది నీటి పురుగులు, జలగలు అని పిలుస్తుంటారు. ఇలా దోమ పిల్లలు (లార్వా) నిల్వ నీటిలో ఉన్నట్లయితే ఆ నీటిని మట్టి లేదా ఇసుకలో పారబోయాలి. ఇలా చేయడం వల్ల లార్వా, ప్యూపా దశల్లో ఉన్న వాటిని వందల సంఖ్యలో నాశనం చేయవచ్చు.
దోమలపై దాడికి లక్షల్లో ఖర్చు..
దోమలు ప్రజారోగ్యాన్ని కాటేస్తున్నాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమల దాడిని తట్టుకునేందుకు ప్రతి నెలా పచారీ సామగ్రి మాదిరిగానే లిక్విడ్స్, మస్కిటో రీఫిల్స్, కాయిల్స్, మస్కిటో ధూప్ స్టిక్స్ వంటి వాటికి నెలకు రూ.100 నుంచి రూ.500 వరకు ఒక్కో కుటుంబం ఖర్చు చేస్తుంది.
దోమల నివారణకు విస్తృత చర్యలు
దోమల నివారణకు విస్తృతంగా చర్యలు చేపట్టాం. ఐఆర్‌ఎస్ ఏసీఎం 5 శాతం ద్రావణాన్ని ప్రతి ఒక్క ఇంట్లో స్ప్రేయింగ్ చేసుకోవాలని చెబుతున్నాం. గంబూషియా చేపలను కూడా మురికి కుంటల్లో వేస్తున్నాం.
– పీవీ సత్యనారాయణ, డీఎంవో,
సీతంపేట ఐటీడీఏ
అవగాహన కల్పిస్తున్నాం
దోమ కారక వ్యాధులు ప్రబలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. యాంటీలార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. మలేరియా, డెంగీ వంటి వ్యాధులకు సంబంధిత పీహెచ్‌సీల్లో కూడా పూర్తిస్థాయిలో మందులు ఉంటున్నాయి. – జె.మోహన్‌రావు,
మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్, సీతంపేట
ఆడదోమలే ప్రమాదకరం..
మగ దోమలు చెట్ల రసాలను పీల్చి బతుకుతాయి. ఆడ దోమలు మాత్రం సంతానాభివృద్ధిలో భాగంగా గుడ్లు పెట్టడానికి మనిషి రక్తాన్ని పీల్చుతుంటాయి. ఈక్రమంలో వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కుట్టిన దోమ రక్తాన్ని పీల్చినప్పుడు రక్తంతో పాటు వ్యాధి కారకమైన పారాసైట్ దోమ లాలాజల గ్రంథుల్లోకి చేరుతుంది. అక్కడ పారాసైట్‌లో కొన్ని మార్పులు జరుగుతాయి. మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని దోమ కుట్టినప్పుడు లాలా జలంతో పాటు పారసైట్ మనిషి రక్తంలో చేరి వ్యాధులకు కారణమవుతాయి.
నివారణ ఇలాచేద్దాం...
దోమలు కుడితే ఎంతటి ప్రాణాంతక విషజ్వరాలు ప్రబలుతాయో అందరికీ తెలిసిందే మలేరియా, డెంగీ వంటి జ్వరాలకు దోమలే కారణం. మస్కిటో రీఫిల్స్, కాయిల్స్ వంటివి మనం దోమల నివారణకు ఇంట్లో వాడతాం. వాటివల్ల కొందరికి శ్వాసకోస వ్యాధులు వస్తాయి. ఈ నివారణ చర్యలు చేపడితే మంచిదే.
వేపనూనె దోమలను తరిమికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని వాసన దోమలు భరించలేవు. వేప, కొబ్బరినూనెలను సమాన భాగాలుగా చేసుకుని బయటకు కనిపించే శరీర బాగాలపై రాసుకుంటే దోమలు దరిచేరవు.
ఇళ్లల్లోకి దోమలు ప్రవేశించే కిటికీల వంటి ద్వారాల వద్ద తులసి మొక్కలను పెంచాలి. ఇవి దోమలను దూరం చేస్తాయి. దోమల వృద్ధి లేకుండా చూస్తాయి.
లెమన్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిశ్రమం దోమలను తరిమికొడుతుంది. ఇది సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్‌గానే కాకుండా ఇన్‌స్టెక్ రిఫ్లెంట్‌గాను పనిచేస్తుంది.
కర్పూరం మెరుగ్గా పనిచేస్తుంది. ఖాళీ ప్రదేశాలను మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగిస్తే దానినుంచి వచ్చే పొగకు దోమలు మాయమవుతాయి.

జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది

జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది

జీవి చిన్నదే.. ప్రమాదం పెద్దది