
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైల్వేస్టేషన్ దగ్గర వనంగుడిలో అమ్మవారికి నేతేటి ప్రశాంత్ ప్రత్యేక పూజలు చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.