
ఘనంగా 9వ ఐద్వా జిల్లా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9వ జిల్లా మహాసభలు మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. మహాసభల సందర్భంగా ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహాం నుంచి యూత్ హాస్టల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు భాగంలో 9మంది మహిళలు ఐద్వా జెండాలు చేతపట్టి నడిచారు. అనంతరం యూత్ హాస్టల్‌లో జరిగిన మహాసభలకు ఐద్వా జెండాను రాష్ట్ర అధ్యక్షరాలు పి.ప్రభావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు పి.ప్రభావతి మాట్లాడుతూ...రాష్ట్రంలో మహిళల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నేడు ప్రతి రోజు 50 మందికి తక్కువ కాకుండా మహిళలపై రాష్ట్రంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నారు. నేడు విస్తారంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు జనాల ప్రాతిపదికన పెంచడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అదే జనాభా ప్రాతిపదికన తాగునీరు అందించడంలో, పేదలకు ఇళ్లు ఇవ్వడంలో, మహిళల మీద దాడులను నియంత్రించడంలో, లైంగిక వేధింపులు అరికట్టడంలో చిత్తశుద్ధి లేదన్నారు. మహిళల హక్కుల మీద దాడి జరుగుతోందని, సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయడం లేదన్నారు. మరో వైపు ప్రభుత్వం మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించినప్పటికీ అమలు కాలేదన్నారు.
భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు
రాష్ట్రంలో ఎక్కడికై నా ఉచిత బస్సు అని చెప్పి నేడు కేవలం పల్లె వెలుగు వంటి బస్సులకు మాత్రమే అవకాశం కల్పించి చేతులు దులుపుకున్నారన్నారు. మరోవైపు మైక్రో ఫైనాన్స్ వేధింపులు తీవ్ర స్ధాయిలో ఉన్నాయన్నారు. మైక్రో ఫైనాన్స్‌లు నియంత్రణకు చట్టం చేయాలని మహాసభ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. మహిళలు హక్కులు కోసం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో మహిళలు సమస్యలు పరిరష్కారం కోసం మహాసభల్లో నిర్ణయాలు చేసి, భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పోరాటాలకు మహిళలు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.