
‘ఓవర్ స్పీడ్’ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్
విజయనగరం క్రైమ్: జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్, హైవేలు, ముఖ్య కూడళ్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి ‘ఓవర్ స్పీడ్‘ తో వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో వెళ్లే వాహనాలపై 23 కేసులు నమోదు చేసి, ఈ చలానా కింద రూ.25,665/ లను విధించామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామన్నారు. అతివేగంతో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సంబంధిత అధికారులు వివరిస్తూ, వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని, తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి వాహనదారు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని హితవు పలికారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారని తెలియజేశారు.
23 కేసుల నమోదు
రూ.25,665 వసూలు