
వైభవంగా ఉట్లోత్సవం
నెల్లిమర్ల రూరల్: శ్రావణ బహుళాష్టమిని పురస్కరించుకుని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో వేణుగోపాలస్వామికి అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు జరిపించారు. వేకువజామున సీతారామస్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం అనంతరం యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం ఉపాలయంలో కొలువుదీరిన వేణుగోపాలస్వామికి బహుళాష్టమి సందర్భంగా పంచామృత స్నపనం, విశేష అర్చనలు నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామిని ప్రత్యేక పల్లకిలో గ్రామ తిరువీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం స్థానిక అయ్యవార్ల మేడ వద్ద ప్రధాన ఘట్టమైన ఉట్లోత్సవాన్ని వేడుకగా జరిపించారు. ఉట్టిని కొట్టేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. కార్యక్రమంలో అర్చకులు నరిసింహాచార్యులు, కిరణ్, రామగోపాల్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు